ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన సోషల్ మీడియా విభాగానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా మూడు రాజధానులు, కరోనా వైరస్, ఇళ్ల పట్టాలు, దళితులపై దాడులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన మాటల్లో…అధికార ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానులు ఒక కలేనని పవన్‌ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానుల గురించి గత ప్రభుత్వ అధికారంలో ఉన్నపుడే  వైసీపీ తన వైఖరి చెబితే.. రైతులు అన్నం పెట్టే అన్ని వేల ఎకరాలు ఇచ్చేవారు కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడు అంగీకారం తెలిపి ఇపుడు అధికారంలోకి వచ్చాకా  రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం సముచితం కాదన్నారు.

ప్రభుత్వం మారడంతో 3 రాజధానుల అంశం తెరపైకి రావడంతో.. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సంగతేంటి అని ప్రశ్నించారు. 200 రోజులకుపైగా పోలీసు వ్యవస్థతో రైతులపై దాడులు జరిపించి.. ఆడవాళ్లు, చిన్న పిల్లలు అని లేకుండా.. విద్యార్థులు, వృద్ధులని లేకుండా లాఠీలతో కొట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాజధాని విడదీసినంత మాత్రాన అభివృద్ది జరుగుతోందని చెప్పడం అంచనా మాత్రమే.. టీడీపీ చెప్పిన సింగపూర్ కాన్సెప్ట్ కూడా ఇలాంటిదే అని పవన్ స్పష్టంచేశారు. గత ప్రభుత్వం కూడా రైతుల నుంచి 30 వేల వరకు భూమిని సేకరించడం తప్పు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

 టీడీపీ-వైసీపీ ఆధిపత్య పోరులో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. రైతులు భూములు ఇచ్చింది పార్టీకి కాదు.. ప్రభుత్వానికి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అమరావతి రైతులకు తాము అండగా ఉంటామని స్పష్టంచేశారు.

ఇళ్లస్థలాలకు భూసేకరణలో చాలా చోట్ల అవకతవకలు జరిగాయని విమర్శించారు. రూ.7-8 లక్షలున్న భూమిని 4-7 రెట్ల ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని తప్పుబట్టారు.

కరోనా విషయంలో రోగులకు సరైన సదుపాయాలు లేవని తెలిసి ఆశ్చర్యపోయానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇంట్లో ఒకరికి వైరస్ వస్తే.. మిగతా వారిని బయటకు వెళ్లొద్దని చెప్పడం సరికాదన్నారు. వైరస్ వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నందున.. కరోనా వస్తోంది, పోతోoది అని నేతలు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేయాలన్నారు. కరోనా పరీక్షలు ఎక్కువే చేస్తున్నారని అభినందించానని.. కానీ తర్వాత జరుగుతోన్న పరిణామాలు తెలిసి విస్తుపోయానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

దళితులపై దాడులు బాధాకరం సాక్షాత్తూ మన హోంమంత్రి సుచిరిత దళిత వర్గానికి చెందిన వారేగా…ఆమె హయాంలోనే దళితులపై దాడులు జరుగుతుంటే ఏమనుకోవాలని పవన్‌ ప్రశ్నించారు.

‘కరోనా అనేది ప్రపంచం మొత్తానికి వచ్చిన ఆపద. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సంసిద్ధతతో ఉంటే దాని తీవ్రతను తగ్గించొచ్చు. దేశంలో రెండు నెలలపాటు విధించిన లాక్‌డౌన్‌ సమయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు’ అని పవన్‌ ఆక్షేపించారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చే వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపిచ్చారు.

రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తూ ఉంటే వివిధ వర్గాల ప్రజల బాధలు తన దృష్టికి వచ్చాయన్నారు. అందుకే చాతుర్మాస్య దీక్షను కేవలం మనశ్శాంతి కోసం కాకుండా ప్రజలంతా బాగుండాలని మొదలుపెట్టానని చెప్పారు.