ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి: రేఖ జవాజి

• త్రాగు నీటి కోసం సాయి నగర్ కాలనీ ప్రజల అవస్థలు
• నీళ్ల బిందె నిండాలంటే నీరసించి పోవాల్సి వస్తుంది
• ఉపాధి లేక వలసలు వెళుతుంటే యంత్రాలతో ఉపాధి పనులు
• పత్తికొండ నియోజకవర్గ సమస్యల పై జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు జావాజి రేఖ

పత్తికొండ, మద్దికెర, త్రాగు నీటి కోసం సాయి నగర్ కాలనీ ప్రజల అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు, రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్ జవాజి రేఖ అన్నారు. స్థానిక మద్దికెరలో జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యురాలు జవాజి రేఖ మాట్లాడుతూ మద్దికెరలో సాయి నగర్ కాలనీ నందు నీళ్ల బిందె నిండాలంటే నీరసించి పోవాల్సి వస్తుందన్నారు. సుమారు ఐదు వందల కుటుంబాలు నివసించే కాలనీ నీటి సమస్యపై స్థానిక అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. మహిళలు నీళ్లు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా పట్టించుకోక పోవడం సిగ్గు చేటన్నారు. ఉపాధి లేక పత్తికొండ నియోజకవర్గ ప్రజలు సుగ్గికి గుంటూరు, బళ్ళారి, బెంగుళూర్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళుతుంటే తుగ్గలి మండలం పెండేకల్లులోని బుగ్గానికుంటలో కూలీలతో చేయించాల్సిన నీటి కొలను పనులను యంత్రాలతో చేపట్టడం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయ అండతోనే ఉపాధి పనులు యంత్రాలతో చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, అందుకు పత్తికొండ నియోజక వర్గం జనసేన కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు హర్షద్, పవన్ కుమార్, రేణు వర్మ, తదితరులు పాల్గోన్నారు.