యువశక్తితో యువతకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్: నేరేళ్ళ సురేష్

గుంటూరు: తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దశాబ్దాల కాలంగా రాజకీయ నాయకులు యువతలో ఉన్న శక్తి సామర్ధ్యాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారని, దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతకు యువశక్తి సభద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న ఉద్యమాలకు ఊపిరి పొసే శ్రీకాకుళంలోని రణస్థలిలో జరిగే యువశక్తి బహిరంగ సభకు సంభందించిన గోడ ప్రతులను మంగళవారం పరమాయగుంటలోని నగర పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఉక్కు నరాలు, ఇనుప కండరాలు ఉన్న యువతతోనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని స్వామి వివేకానంద ఉద్భోదించేవారన్నారు. దేశానికి పట్టుకొమ్మల్లాంటి యువతను మద్యం, గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు బానిసను చేసి యువశక్తిని రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూనే ఉన్నారని నెరేళ్ల సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేనాని శంఖారావాన్ని పూరిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు, యువతకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు పెట్టడానికే మన యువత – మన భవిత పేరుతో యువశక్తి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి మాట్లాడుతూ తమ దాష్టీకాల, అరాచకాల నుంచి యువత దృష్టి మరల్చేందుకే రాష్ట్రాన్ని గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు నిలయంగా మార్చారని విమర్శించారు. యువతకు ఇరవై ఐదు కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల బంగారు భవిష్యత్ అందించటం కోసం పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడుతున్నారన్నారు. యువశక్తికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున యువకులు తరలిరావాలని పద్మావతి కోరారు. సమావేశంలో కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, నగర ఉపాధ్యక్షుడు కొండూరి కిషోర్, ప్రధాన కార్యదర్సులు యడ్ల నాగమల్లేశ్వరరావు, కటకంశెట్టి విజయలక్ష్మి, ఆనంద్ సాగర్, ఉదయ్, నాగేంద్ర సింగ్, గడదాసు అరుణ, పులిగడ్డ గోపి, కొత్తకోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.