దళితులను ఉన్నత స్థాయిలో చూడాలన్నదే పవన్ కళ్యాణ్ తపన

  • దళితులను అన్ని విధాలా దగా చేసిన వైసీపీ ప్రభుత్వం
  • త్వరలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర రెల్లి నేతలతో ప్రత్యేక సమావేశం
  • జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

గుంటూరు, స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత కూడా రాష్ట్రంలో దళితులను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, దళితులను ఉన్నతస్థాయిలో చూడాలని పవన్ కళ్యాణ్ ఎంతో తపన పడుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాష్ట్ర రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ ఆధ్వర్యంలో ఆదివారం రెల్లి సంఘ నేతలు నాదెండ్ల మనోహర్ తో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎస్సి ఎస్టీల్లో ఉన్న పేదరికాన్ని అవగాహనారాహిత్యాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. దళితులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని తమ రక్త సంబంధీకుల కన్నా ఎక్కువగా నమ్మారని, అలాంటి దళితులకు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ రెడ్డి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సమగ్ర సంక్షేమం కోసం ఎప్పటినుంచో ఉన్న సుమారు 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి, దళితుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత పాశవికంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే ఉన్మాద స్థితికి వైసీపీ పాలన చేరిందన్నారు. సమాజంలో నాగరీకత పెరిగిన సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కొన్ని నిమ్న కులాలు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నాయన్నారు. తాను రెల్లి కులాన్ని దత్తత తీసుకుంటున్నాను అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో ఆ క్షణం నుంచి రెల్లి జాతికి గౌరవం, విలువ మరింత పెరిగాయన్నారు. ప్రతీ రెల్లి జాతి యువకుడి గుండెల్లో పవన్ కళ్యాణ్ శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని త్వరలోనే రాష్ట్రంలోని రెల్లి జాతితో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, అనకాపల్లి, తిమ్మపాలు నుంచి వచ్చిన రెల్లి నేతలు మనోహర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోన అప్పారావు, గోపి, కోన దుర్గ, ధనాల రాఘవేంద్ర, సోమి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.