నెల్లూరు మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు ప్రభాకర్ రెడ్డికి పవన్ సత్కారం

నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత ప్రభాకర్ రెడ్డిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సత్కరించారు. ఈ ఉదయం తన కార్యాలయానికి విచ్చేసిన ప్రభాకర్ రెడ్డిని సముచిత రీతిలో గౌరవించారు. ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్’ ట్రస్టు ద్వారా ప్రభాకర్ రెడ్డికి రూ.1 లక్ష ఆర్థికసాయం కూడా అందజేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ‘వింగ్ చున్’ అనే పోరాట విద్య గురించి, ఆ విద్యను మనదేశంలో నేర్పే గురువుల గురించి ఇంటర్నెట్లో వెదుకుతుంటే ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసిందని వెల్లడించారు. మార్షల్ ఆర్ట్స్ లో అనేక దేశాల్లో శిక్షణ పొంది, అనేక ఘనతలు సొంతం చేసుకున్న ప్రభాకర్ రెడ్డి పెద్ద పెద్ద నగరాలకు వెళ్లకుండా తన సొంతూళ్లోనే ఉంటూ యువతకు తర్ఫీదునివ్వడం సంతోషకరం అని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి వంటివారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తమ ట్రస్టు ద్వారా ఆర్థికసాయం అందజేశామని పవన్ వివరించారు.

కాగా, పవన్ కల్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎనలేని మక్కువ అని తెలిసిందే. ‘వింగ్ చున్’ పై ఆసక్తికతో ప్రభాకర్ రెడ్డి ద్వారా కొన్ని మెళకువలు తెలుసుకున్నారు.