100 రోజులుగా కొనసాగుతున్న పవనన్న చేనేత బాట

చీరాల, పవనన్న చేనేత బాట కార్యక్రమం – చీరాల నియోజకవర్గంలో 100 రోజులు పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో చీరాల నియోజకవర్గ జనసైనికులు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసి, ఈ 100 రోజుల కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ ప్రయాణంలో ప్రతి చేనేత కళాకారుడి గడప నుంచి వారు విన్నటువంటి సమస్యలు, చేనేత కళాకారులు పడుతున్న బాధలు కష్టాలు వాటికి పరిష్కారం జనసేన పార్టీతోనే సాధ్యమని తెలియజేసి, చేనేత కళాకారుల సమస్యలను మరొక్కసారి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్ళమని తెలియజేయడం జరిగింది. ఈ 100 రోజుల యాత్రకు మద్దతును ఇచ్చినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవనన్న చేనేత బాట కార్యక్రమం మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మహాత్మ గాంధీ విదేశీ వస్త్రాలు వద్దు భారతదేశ వస్త్రాలే ముద్దు అంటూ ఆయన చేనేత వస్త్రాలే ధరించేవారని ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం కూడా పాటించాలని సూచించారు. చేనేతల కష్టాలు తీరేది జనసేన పార్టీ అధికారంలోకి రావడంతోనే సాధ్యమని ప్రతి ఒక్క చేనేత కళాకారున్ని వ్యాపారస్తుడిగా మార్చడమే జనసేన పార్టీ ధ్యేయమని దాని కోసం జనసేన పార్టీ పోరాడుతుందని తెలియజేసి, యాత్ర చేపట్టినటువంటి చీరాల జనసైనికులకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసి చీరాల నియోజకవర్గ జనసైనికులను మరింతగా ముందుకు సాగాలని కోరారు. అలాగే చీరాల నియోజకవర్గ జనసైనికులు 1000 చేనేత కార్మికుల కుటుంబాల ఆర్ధిక స్థితిగతులతో సంకలనం చేసిన రెండు పుస్తకాలను స్వీకరించడం జరిగింది. పుస్తక రూపంలో ఉన్న చేనేత కళాకారుల సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చీరాల నియోజకవర్గ జనసైనికులు కర్ణ కిరణ్ తేజ్, బూడిద వరం, పింజల సంతోష్ మరియు పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు.