వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి

కరోనా కారణంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను పునః ప్రారంభించుకునేందుకు దోహదం చేసే క్రమంలోనే ”ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి(పీఎం స్వనిధి)’ పథకాన్ని ప్రారంభించిందని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వీధి వ్యాపారులైతే మరింత ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ మీడియా సందేశాన్ని విడుదల చేశారు.

వ్యవస్థీకృత ఆర్ధిక వ్యవస్థలో భాగంగా లేని చిన్న వ్యాపారులకు సహాయం కోసం ఉద్దేశించిన ఈ పథకం ఒక గొప్ప ప్రయత్నమని ఈ సందర్భంగా పేర్కొన్న కిషన్ రెడ్డి… పీఎం స్వనిధి పథకం కింద ఒక వీధి వ్యాపారి… 2022 మార్చి వరకు రూ. 10 వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా సులభంగా తనవ్యాపారం కోసం మూలధన రుణాన్ని పొందవచ్చని వెల్లడించారు.

ఈ రుణం కాలపరిమితి ఒక సంవత్సరం కాగా, ముందస్తుగా కూడా చెల్లించుకునే అవకాశముందని తెలిపారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని వెల్లడించారు. ఇది నేరుగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలోకి జమవుతుందని తెలిపారు.

డిజిటల్ లావాదేవీలను నిర్వహించడం ద్వారా రూ. 1,200 వరకు నగదును పొందే అవకాశముందని, ఈ మొత్తం కూడా లబ్దిదారుని ఖాతాలో ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానంలో జమచేస్తారని చెప్పారు.