యూపీకి వరాల జల్లు.. 75 ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు ( Azadi@75) అయిన సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ 75 ప్రాజెక్టులను త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీకి అంకితం చేయనున్నారు. మూడు రోజుల జాతీయ ‘న్యూ అర్బన్ ఇండియా కాంక్లేవ్’ ను నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ఆజాదీ 75లో భాగంగా మోదీ ఈ రోజు లక్నోలో పర్యటించనున్నారు. ఈ మేరకు 4737 కోట్ల విలువైన 75 ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. దీంతోపాటు 75,000 మంది లబ్ధిదారులకు పీఎమ్ హౌసింగ్ స్కీమ్ కింద గృహాలను కేటాయించి లబ్ధిదారులతో సంభాషించనున్నారు.

దీంతోపాటు లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగరాజ్, గోరఖ్‌పూర్, ఝాన్సీ, ఘజియాబాద్‌తో సహా ఏడు నగరాల కోసం FAME-II కింద ఏర్పాటు చేసిన 75 బస్సులను కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద 75 ప్రాజెక్టులకు సంబంధించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఎక్స్‌పోలో నిర్వహిస్తున్న మూడు ప్రదర్శనలను కూడా ఆయన సందర్శిస్తారు. లక్నోలోని బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ యూనివర్సిటీ (BBAU) లో ఏర్పాటు చేయనున్న అటల్ బిహారీ వాజ్‌పేయి పీఠం గురించి కూడా ప్రధాని ప్రకటించనున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తోపాటు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొననున్నారు. కాన్ఫరెన్స్-కమ్-ఎక్స్‌పో కార్యక్రమం ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అక్టోబర్ 5 నుండి 7 వరకు హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (MoHUA) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.