మెగాస్టార్ కు పవర్ స్టార్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మెగా అభిమానులంతా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన చిత్రాలను పంచుకుని విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తన అన్నయ్య చిరంజీవికి పవన్ కల్యాణ్ ప్ర‌త్యేకంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపారు. జనసేన తరపున జనసేనాని అన్నయ్యకు ఓ లేఖ రాసి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తన అన్నా వ‌దిన‌లను త‌న త‌ల్లిదండ్రులుగా భావిస్తాన‌ని ప‌వ‌న్ అన్నారు.  ఆయ‌న క‌ష్ట‌ప‌డే తత్వం ప్ర‌తీ ఒక్క‌రికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని, ఆయన తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని లేఖ‌లో పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని రాశారు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన్ను తెలుగు ప్రజలంతా ఆశీర్వదించాలని కోరుతూ.. అన్నయ్య కు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.