పోస్టల్ ద్వారా ఆలయాల నుంచి ప్రసాదాలు..

భక్తులకు శుభవార్త..  రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలను భక్తుల దగ్గరకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు ఏపీ దేవదాయ శాఖ  ప్రకటించింది. ఇందుకోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచారామాలైన అమరారామం (అమరావతి), సోమారామం (భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), భీమారామం (ద్రాక్షారామం), కుమారామం (సామర్లకోట) చిత్రాలు ముద్రించిన 5 రకాల పోస్టు కార్డులను పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. అయితే ఈ కార్డులను మంత్రి బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అటు పలు ఆలయాల్లోనూ పోస్టల్ శాఖ, దేవదాయ శాఖ అధికారులు ఈ పోస్టుకార్డుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆన్‏లైన్‏లో ఒకేసారి నిర్వహించారు.

దీనిపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలు, దేవాలయాలపై పోస్టు కార్డులు ప్రింట్ చేయడం చాలా సంతోషకరమన్నారు. ఏపీ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, విజయవాడ సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ టీ.యం. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.