కరోనా కంట్రోల్‌కు ప్రధాని ఐదంచెల వ్యూహం!

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్ కు సెంట్రల్ టీమ్స్ ను పంపాలని ప్రధాని మోడీ ఆదేశించారు. దేశంలో కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్, వ్యాక్సినేషన్, కరోనా గైడ్ లైన్స్ పక్కాగా అమలు చేయాలన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయని.. డొమెస్టిక్, ఫారిన్ కంపెనీలతోనూ చర్చలు జరుపుతున్నామని చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఆదివారం ఆయన హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. మాస్కులు పెట్టుకోకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ ను పాటించకపోవడం, కరోనా పట్ల భయం లేకపోవడం, గైడ్ లైన్స్ పక్కాగా అమలు చేయకపోవడంతో కేసులు పెరిగాయని అధికారులు వివరించారు. మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్ లో పరిస్థితి సీరియస్ గా ఉందన్నారు. గడిచిన 14 రోజుల్లో పశ్చిమ రాష్ట్రాల్లోనే 57 శాతం కేసులు, 47 శాతం మరణాలు నమోదైనట్టు వివరించారు. 10 రాష్ట్రాల్లో 91 శాతం కేసులు, 90.9 శాతం మరణాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ మీటింగ్ లో పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఎంపవర్ గ్రూప్ చైర్ పర్సన్, హెల్త్ సెక్రటరీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 6 నుంచి 14 వరకు స్పెషల్ క్యాంపెయిన్

కరోనాపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 6 నుంచి 14 వరకు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలని, ఇందులో ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రధాని మోడీ ఆదేశించినట్టు పీఎంవో వెల్లడించింది. ఇందులో భాగంగా 100% మాస్కుల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, పబ్లిక్ ప్లేస్ లు, పని ప్రదేశాలు, హెల్త్ ఫెసిలిటీస్ లో శానిటేషన్ కు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.