వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థలతో ప్రధాని భేటీ

కరోనా వ్యాక్సిన్‌ పురోగతిపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న సంస్థలను స్వయంగా సందర్శించిన ప్రధాని మోడీ.. నేడు మరో మూడు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జెనోవా జయోఫార్మా, బయోలాజికల్‌ ఈ, డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థల ప్రతినిధులతో మోడి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు, సామర్థ్యం తదితర సమాచారాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా తేలికైన భాషలో చెప్పేందుకు ప్రయత్నించాలని కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ఫార్మా సంస్థలకు ప్రధాని మోడి సూచించారు. వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. పుణెకు చెందిన జెనోవా బయోఫార్మా లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్‌ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. వ్యాక్సిన్ రవాణా, భద్రత, పంపిణీ తదితర అంశాలపైనా ప్రధాని చర్చించినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని మోడి ప్రశంసించారు.