విలువైన ప్రభుత్వ స్థలాలను రక్షించండి

  • బెలగాంలోని లక్ష్మునాయుడు చెరువులో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఆపాలి
  • ఎమ్మార్ నగరంలో కబ్జాలు అరికట్టాలి
  • కబ్జాదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
  • జిల్లా జాయింట్ కలెక్టర్ ని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను, చెరువులను, స్థలాలను రక్షించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావును జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు కలిసి జిల్లాలో జరుగుతున్న చెరువులు, ప్రభుత్వం భూములు, స్థలాలు కబ్జాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోని పలు చెరువులు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి అన్నారు. వాటిపై గతంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా ఆర్డీవో ద్వారా తీసుకున్న చర్యలకు కబ్జాదారులు కొన్ని ప్రాంతాలలో కబ్జాలు నిలిపివేశారన్నారు. అయితే పార్వతీపురం బెలగాంలోని లక్ష్మనాయుడు చెరువులో మాత్రం కబ్జాదారులు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఓ రాజకీయ నాయకుడు ఆ చెరువులో స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే చెరువుల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. అలాగే ఆక్రమణదారులపై చట్టప్రకారమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పార్వతీపురం మండలంలోని ఎమ్మార్ నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అక్కడ కొంతమంది కబ్జాదారులు దర్జాగా కబ్జా చేస్తున్నారన్నారు. మట్టి పోసి పునాదులు వేస్తున్నారన్నారు. ఈ విషయమై గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేకపోవడంతో కబ్జాదారులు దర్జాగా తాము కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. తక్షణమే వీటిపై తగు చర్య తీసుకోవాలని కోరారు. పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడ్డాక స్థలాలకు విపరీతంగా రేట్లు పెరగడంతో అక్రమార్కుల దృష్టి చెరువులు, పల్లెటూర్లలో ప్రభుత్వ భూములపై పడ్డాయి అన్నారు. దీనితో కోట్లాది రూపాయలు విలువైన ప్రభుత్వ భూములు, కబ్జాదారులు ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపట్టి సొంతం చేసుకుంటున్నారన్నారు. కాబట్టి తక్షణమే లక్ష్మనాయుడు చెరువుతో పాటు ఎంఆర్ నగరంలో ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న కబ్జాలు, అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కే.హేమలతను ఆదేశించారు.