త్రాగు నీటి సదుపాయం కల్పించాలని వనభంగిలో ఖాళీ బిందెలతో నిరసన

అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం వనభంగిలో గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గ్రామంలో సుమారు వంద కుటుంబాలకు పైగా జీవిస్తున్న అప్పటికీ గత రెండు సంవత్సరాలుగా త్రాగునీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు ఉన్నత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎవరు కూడా స్పందించడం లేదని, వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుక్క నీరు కోసం మహిళలంతా కొట్టుకు చస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జాగరపు పవన్ కుమార్ మాట్లాడుతూ వనభంగి గ్రామంలో వందకు పైగా కుటుంబాలు జీవిస్తున్న అప్పటికీ గత రెండేళ్లుగా త్రాగునీటి సదుపాయం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పలుమార్లు ఉన్నత అధికారులకు తెలియజేసి నప్పటికీ ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవని, గుక్కెడు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని లేనిపక్షంలో మండల కేంద్రంలో ఖాళీ బిందెలతో ధర్నా చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాంబాబు, వీరేశ్, చేనాపతి రత్నమ్మ, రాణి, అమ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.