సేవా కార్యక్రమాల కోసం ఊహకందని భారీ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునీత్ రాజ్ కుమార్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రోజులు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం అభిమానులని వదలడం లేదు. చాలా మంది ఇంకా పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఆయన మరణించారనే చేదు వార్తను విని తట్టుకోలేక కొంతమంది అభిమానుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతేగాక రోజు ఆయన సమాధి వద్దకు వందల, వేల సంఖ్యల్లో తరలివస్తున్నారు. ఇంతమంది ప్రేక్షకుల అభిమాన్ని పునీత్‌ కేవలం హీరోగా మాత్రమే గెలుచుకోలేదు. ఆయన చేపట్టిన ఎన్నో సేవ కార్యక్రమాలతో, స్టార్‌ హీరో అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా అందిరితో కలిసిపోవడం, తన కోసం వచ్చిన ప్రతి అభిమానిని పేరుపేరున కలిసి పలకరించే వ్యక్తిత్వంతో ఇలా పునీత్‌ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఆయన మరణాంతరం పునీత్‌ సేవాకార్యక్రమాలకు సంబంధించిన వార్తలు వస్తుండటం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పించారు. ఆఖరికి మరణాంతరం తన రెడు కళ్లు కూడా దానం చేశారు. వీటితో పాటు మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టిన పునీత్‌ హఠాత్తుగా లోకాన్ని విడిచి వెల్లడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. అంతేగాక తాను ఉన్న లేకపోయిన తను చేపట్టిన సేవ కార్యక్రమాలు ఎప్పటిలాగే కొనసాగాలని పునీత్‌ వాటి పేరుతో 8 కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించారట. ఈ విషయం తెలిసి ఎంతో మంది ఆయన గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు.