నేడు ఎపి, ఒడిశా ముఖ్యమంత్రుల భేటీ.. చర్చలు ఫలిస్తే ఇరు రాష్ట్రాలకూ మేలే !

ఆంధ్రా, ఒడిశా మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి మంగళవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతుండడంతో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు 34 ఏళ్ల తర్వాత మళ్లీ జరుగుతున్నాయి. సమస్యలు సానుకూలంగా పరిష్కారం అయితే, ఇరు రాష్ట్రాలకూ మేలు జరగనుంది. వంశధార జల వివాదంతో శ్రీకాకుళం జిల్లాలో ఆరు దశాబ్దాలుగా నేరడి బ్యారేజీ నలుగుతోంది. నేరడి బ్యారేజీ నిర్మాణం న్యాయబద్ధమేనని పలు సందర్భాల్లో ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చినా ఒడిశాను ఒప్పించే పని ఇప్పటివరకు జరగలేదు. 1987 జనవరి 15న న్యూఢిల్లీలో అంతర్రాష్ట్ర సమావేశంలో అప్పటి ఎపి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌, ఒడిశా సిఎం బిజూ పట్నాయక్‌ మధ్య చర్చలు జరిగాయి. నేరడి బ్యారేజీకి ఎగువన ఒడిశా ప్రాంతంలో 3.80 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మాణంతో పాటు ఒడిశాలో బ్యారేజీ నిర్మాణ కట్టడాలను 106 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసేందుకు ఇరువురు ముఖ్యమంత్రులూ అంగీకరించారు.
    ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారడం తదితర కారణాలతో ఒప్పందం అమలు కాలేదు. వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2లో భాగంగా నిర్మించాల్సిన నేరడి బ్యారేజీ ప్రాజెక్టుకు ఒడిశా అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేరడి బ్యారేజీ నిర్మాణంతో ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లాలోని గుణుపూర్‌, గుడారి ప్రాంతాలు మునిగిపోతాయని, గంజాం జిల్లాలోని బడిగాం, సర ప్రాంతాల భూములకు నష్టం వాటిల్లితుందని ఒడిశా వాదన. నేరడి బ్యారేజీ నిర్మాణం చేపట్టవచ్చని సెప్టెంబర్‌ 13, 2017లో ఎపికి అనుకూలంగా ట్రిబ్యులన్‌ తీర్పు ఇచ్చింది. బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాలను సేకరించి ఇవ్వాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర జలవనరుల కమిషన్‌ ఆధ్వర్యంలో ఎపి, ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ట్రిబ్యునల్‌ సూచించింది. దీనిపై ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితేనే 19 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఒడిశాకూ ప్రయోజనం కలగనుంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని విజయనగరం జల్లా జంఝావతి సాగునీటి ప్రాజెక్టు, కొఠియా గ్రామాలపై వివాదం నెలకొంది. జంఝావతి ప్రాజెక్టు రబ్బరు డ్యాముకే పరిమితం అయింది. దీంతో, నాలుగు వేల ఎకరాలకు మించి నీరు అందడం లేదు. ఈ వివాదం పరిష్కారమైతే 24,640 ఎకరాలకు సాగునీరు అందనుంది. 21 కొఠియా గ్రామాల వివాదం దశాబ్దాల తరబడి కొనసాగుతోంది. దీనిపై కూడా చర్చలు జరగనున్నాయి.