రైతుల కోసం పంజాబ్ న్యాయవాది ప్రాణ త్యాగం

ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా ఆదివారం ఓ లాయర్ ప్రాణ త్యాగం చేశాడు. ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే పంజాబ్‌కు చెందిన అమర్‌జీత్ సింగ్ అనే న్యాయవాది ఆత్మహత్య చేసుకున్నాడు. టిక్రి సరిహద్దులో విషం తాగి చనిపోయిన అమర్‌జీత్ పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా జలాలాబాద్ ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అమర్‌జీత్‌ను  రైతులు కొందరు రోహ్తక్ లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు.

కాగా, అన్నదాతల ఆందోళనను చూసి తాను చలించిపోయానని, వారికోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నానని ఈ అడ్వొకేట్ త న సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.  ప్రజల మాట విని వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆ లేఖలో ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అమర్‌జీత్ డిసెంబర్ 18న సూసైడ్ నోట్ రాసిపెట్టుకున్నట్లు ఆ లేఖపై ఉన్న తేదీని బట్టి తెలుస్తున్నదని పోలీసులు తెలిపారు. అమర్‌జీత్ కంటే ముందే మరో ఇద్దరు కూడా రైతుల ఆందోళనకు మద్దుతుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.