భారీ వర్షాలతో కుంగిన పురానాపూల్ బ్రిడ్జి

భారీ వర్షాల దెబ్బకు ఇంకా హైదరాబాద్‌ వాసులు కోలుకోలేదు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్‌లోని 400 ఏళ్ల పురాతన పురానాపూల్ బ్రిడ్జిపై పడింది. వరద ఉద్దృతి పెరగడంతో బ్రిడ్జి ఒత్తిడికి గురైంది. దీంతో.. ఓ పిల్లర్‌ కుంగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు ఇరు వైపుల నుంచి ట్రాఫిక్ నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. 4 శతాబ్దాల కాలంలో పురానాపూల్ బ్రిడ్జి దెబ్బతినడం ఇది రెండోసారి మాత్రమే. హైదరాబాద్‌లో నిర్మించిన తొలి వంతెనగా రికార్డులకెక్కిన ఈ బ్రిడ్జి 1820లో వచ్చిన మూసి వరదలకు స్వల్పంగా దెబ్బతింది. దీంతో అప్పటి నవాబు సికిందర్ షా మరమ్మతులు చేయించాడు. 1908లో మరోమారు దీనికి మరమ్మతులు చేశారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ వెళ్లేందుకు వీలుగా 1578లో ఇబ్రహీం కులీ కుతుబ్‌షా దీనిని నిర్మించాడు.