‘పుష్ప’ సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్ హఠాన్మరణం!

దాదాపు 200 చిత్రాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేసిన జి.శ్రీనివాస్, నిన్న రాత్రి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభం కాగా, స్టిల్స్ కోసం ఆయన కూడా వెళ్లారు. గురువారం నాడు లొకేషన్ లో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన కన్నుమూశారు. ఈ ఘటనపై చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా, పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.