రానా ‘అరణ్య’ 2021 సంక్రాంతికి విడుదల

రానా దగ్గుబాటి తన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అరణ్య’ సంబంధించి తన అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే వార్తను షేర్ చేశారు. త్వరలోనే అరణ్య సినిమా థియేటర్లను పలకరించనుందని ప్రకటించారు. నిరీక్షణ ఇక చాలు..’అరణ్య’ సినిమాను 2021 సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయబోతున్నామని ‘అరణ్య’ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో రిలీజ్  చేశారు. అందులో ఒక పగిలిన గోడ, ఏనుగులు, జలపాతం ఉండగా.. మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. అంతేకాదు ప్రస్తుతం కోవిడ్ మహమ్మారిపై మన పోరాటం.. మానవ విధ్వంసంపై అడవుల పోరును సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విధ్వంసం ఎప్పుడు ఆగుతుంది!? అరణ్య సినిమాతో అవగాహన పెంచుకుందాం అంటూ రానా కమెంట్  చేశారు. 

కాగా ఈ మూవీలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్‌, శ్రియ పల్గావోంకర్ తదితులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించింది. శంతను మొయిత్రా సంగీతం అందించిన ఈ మూవీ తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని చిత్రాలు ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.