రానా- మిహీక పెళ్లి ఏర్పాట్లు

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా వివాహానికి ఏర్పాట్లు ప్రత్యేక నిబంధనల ప్రకారం సాఫీగా సాగుతున్నాయి. కోవిడ్ నియమ నిబంధనల వల్ల ఈ వివాహం ఆగస్టు 8 న సింపుల్ గా కుటుంబీకులు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది.

హైదరాబాద్ లో అంతకంతకు పెరుగుతున్న కొరోనా వైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వివాహ వేదికను బయో-సేఫ్టీ బబుల్ గా మార్చడానికి ఇరు కుటుంబాలు ప్రణాళికలు సిద్ధం చేశాయని సమాచారం. కోవిడ్ సోకకుండా అన్ని భద్రతా నియమాలు పాటించనున్నారు. పెళ్లికి వచ్చే ప్రతి అతిథికి కోవిడ్ టెస్టులు చేయిస్తున్నారని సమాచారం. అలాగే వేదిక అంతటా శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. సామాజిక దూరం తప్పనిసరి. ఇక రానా పెళ్లిలో ప్రభాస్- రామ్ చరణ్- వరుణ్ తేజ్- రాజమౌళి- ఆర్కా సభ్యులు సహా పలువురు ప్రముఖులు సందడి చేసే వీలుందని తెలుస్తోంది.