‘రంగం’ దర్శకుడు కన్నుమూత

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్‌(54) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కె.వి.ఆనంద్‌ మృతితో తమిళ చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇటీవల కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ సైతం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇద్దరు గొప్ప వ్యక్తులు వెంట వెంటనే మృతిచెందడం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘తెన్నావిన్‌ కోంబత్‌’ అనే మలయాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా 1994లో కె.వి.ఆనంద్‌ కెరీర్‌ను ఆరంభించారు. తమిళం, మలయాళం, తెలుగు, బాలీవుడ్‌ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తెలుగులో తెరకెక్కిన ‘పుణ్యభూమి నాదేశం’ సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్‌.’తెన్నావిన్‌ కోంబత్’ చిత్రానికిగానూ కె.వి.ఆనంద్‌కు జాతీయ అవార్డు వరించింది. ఆయన దర్శకుడిగానూ పలు చిత్రాలు తెరకెక్కించి అందర్నీ మెప్పించారు. ‘రంగం’, ‘బందోబస్తు’,’బ్రదర్స్‌’ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.