కరోనా నుంచి కోలుకున్నా..

తాను కరోనా వైరస్ బారినపడి పూర్తికా కోలుకున్నట్టు తమన్నా భాటియా వెల్లడించారు. అయితే, వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ‘సెట్‌లో నేను, నా టీమ్‌ జాగ్రత్తలన్నీ తీసుకుని క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ… గత వారం నాకు స్వల్ప జ్వరం వచ్చింది. పరీక్షలు చేయించుకోగా, నాకు కొవిడ్‌19 పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది” అని కథానాయిక తమన్నా తెలిపారు. ఆమె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోమవారం రాత్రి అధికారికంగా ధృవీకరించారామె. తాను డిశార్జి అయినట్టు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో తమన్నా పేర్కొన్నారు. ”హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి స్వయంగా వెళ్లి చేరాను. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు డిశ్చార్జి అయ్యాను.

కరోనా నుండి త్వరగా కోలుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి” అంటూ తమన్నా తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన లేఖలో పేర్కొంది.