పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు..

మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత రానుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్‌ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.

అందులో భాగంగానే సెప్టెంబరు 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఆ తర్వాత నవంబరు 2 నుంచి ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. కానీ… వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ధరణిలోకి ఎంట్రీ చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురుకావడం, ఇదే అంశంపై కొంత మంది కోర్టుకెళ్లడంతో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాలేదు. కోర్టులో కేసు తేలనుందని, నవంబరు 25నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు. ఆ పిటిషన్ల విచారణను డిసెంబరు 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఆ రోజున స్పష్టత వస్తే… ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కానీ… ఆ రోజున కూడా కోర్టులో స్పష్టత రాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని యోచిస్తోంది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ల అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఒకటి-రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇటీవల మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.