ఫించన్లు తొలగించడం సరైన పద్ధతి కాదు: గురాన అయ్యలు

విజయనగరం: సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న వైకాపా తీరును జనసేననాయకులు గురాన అయ్యలు వ్యతిరేకించారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవన్నారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనే రద్దు చేయాలని చూడటం విచిత్రంగా ఉందన్నారు. అలాగే సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా రాజకీయ ప్రయోజనాలకు వైకాపా ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. వాలంటీర్‌లతో వైసీపీ సమావేశాలు నిర్వహించడం దారుణమన్నారు.