రాష్ట్రాల పరిది లోనే పీజీ కోర్సుల రిజర్వేషన్

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ప్రభుత్వ వైద్యులకు పీజీ మెడికల్‌ కోర్సుల ప్రవేశాల్లో రిజర్వేషన్‌ కల్పించే అధికారం రాష్ర్టాలకు ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. ఈ అధికారాలను భారత వైద్య మండలి (ఎంసీఐ) అడ్డుకోవడం ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎంసీఐ అనేది చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ మాత్రమేనని, రిజర్వేషన్ల కోసం నిబంధనలను ఏర్పరిచే అధికారం దానికి లేదని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌లు ఇందిరా బెనర్జీ, వినీత్‌ శరణ్‌, ఎంఆర్‌ షా, అనిరుద్ధ బోస్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ప్రభుత్వ వైద్యులకు పీజీ కోర్సుల ప్రవేశాల్లో రిజర్వేషన్‌ ప్రయోజనాలను కల్పించాలని పేర్కొంటూ తమిళనాడు మెడికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది.