రైతన్నలకు రేవంత్ రెడ్డి సంఘీభావం.. తెలంగాణకు రావాలని ఆహ్వానం

ఘాజీపూర్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఘాజీపూర్‌లోని రైతుల నిరసన శిబిరాల వద్దకు వెళ్లారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ను కలిశారు. తెలంగాణలో పది రోజుల పాటు తాను చేపట్టిన రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్ర గురించి ఆయనతో చర్చించారు. తన పాదయాత్రకు రైతుల నుంచి విశేష ఆదరణ వచ్చిందని వివరించారు. మిగతా రైతు నేతలతోనూ రేవంత్‌ మాట్లాడారు.

తెలంగాణలో తన ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రానికి రావాలని టికాయిత్‌ను రేవంత్‌ ఆహ్వానించారు. దీనిపై స్పందించిన టికాయిత్‌ మార్చి మొదటి వారంలో తెలంగాణకు వస్తానని చెప్పినట్టు సమాచారం. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇటీవల రాజీవ్‌ రైతు భరోసా పాదయాత్రను ఈ నెల 7న ప్రారంభించిన విషయం తెలిసిందే. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి రంగారెడ్డి జిల్లా రావిరాల వరకు పది రోజుల పాటు కొనసాగిన ఆయన పాదయాత్ర ఇటీవలే ముగిసింది.