సంక్షోభంలో వరి సాగు….సాగలేమంటున్న కోనసీమ

*వేలాది ఎకరాల్లో పంట విరామం ప్రకటించిన అన్నదాతలు
*వరదలు, మురుగు నీరే ప్రధాన సమస్య
*పెరిగిన ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలూ కారణమే

కోనసీమ అనగానే పుష్కలంగా నీరు, ఏటా మూడు పంటలు పండించే సారవంతమైన భూములే గుర్తుకు వస్తాయి. కానీ అదే కోనసీమలో వరి సాగు సంక్షోభంలో పడింది. ఖర్చులు పెరిగి పోవడం, కూలీల కొరతకు తోడు కోనసీమలో వరద ముంపు సమస్య ప్రధాన అవరోధంగా మారింది. దీంతో ఖరీఫ్ లో వరి సాగుకు విరామం ఇవ్వాలని ఇప్పటికే వేలాది మంది రైతులు తీర్మానం చేశారు. దేశానికే అన్నం పెట్టి అన్నపూర్ణగా ఖ్యాతి గడించిన కోనసీమలో పంట పొలాలు ఈ ఏడాది బీడు భూములుగా దర్శనం ఇవ్వనుండటం బాధాకరం.
* తహశీల్దార్లకు రైతు పరిరక్షణ సమితి మొర
కోనసీమ జిల్లాలోని అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లోని దాదాపు 24000 ఎకరాల్లో రైతులు ఖరీఫ్ వరి సాగుకు ఇప్పటికే విరామం ప్రకటించారు. ఈ ఖరీఫ్ లో వరి సాగు చేయడం లేదని కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆయా మండలాల్లోని తహశీల్దార్లకు వినతి పత్రాలు అందచేసింది. కోనసీమలో మురుగునీటి కాలువలు శుభ్రం చేసి, ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా తమ గోడు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఖరీఫ్ లో వచ్చే వరదలకు తోడు మురుగునీటి కాలవల నుంచి ఎగదన్నే మురుగుతో పంట సక్రమంగా పండటం లేదు. అరకొరగా వచ్చిన దిగుబడులకు కూడా నాణ్యత లేదని అతి తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు అధికారులకు తెలియజేశారు. ప్రభుత్వానికి అమ్మిన ధాన్యానికి 6 నెలలకు కూడా డబ్బు ఇవ్వకుండా వేధిస్తున్నారని కూడా కోనసీమ రైతులు తహశీల్దార్లకు తెలిపారు. సాగు ఖర్చులు పెరిగి పోవడం, కూలీల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా వీటికి అదనంగా కోనసీమలో వరద ముంపు ప్రధాన సమస్యగా మారడంతో ఖరీఫ్ లో వరి సాగుకు విరామం ప్రకటించారు.
* వరి సాగు ఎక్కడా గిట్టుబాటు కావడం లేదు
కేవలం కోనసీమలోనే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ వరి సాగు గిట్టుబాటు కావడం లేదు. పెరిగిన ఎరువుల ధరలు, డీజిల్ ధరలు, కూలీ ఖర్చులతో ఎకరా వరి సాగుకు రూ.40,000 వరకు ఖర్చవుతోంది. సగటున 30 బస్తాల దిగుబడి వచ్చినా రూ.36,000 వచ్చే అవకాశం ఉంది.అంటే పంట సక్రమంగా ఇంటికి చేరినా ఎకరా వరి సాగులో రూ.4,000 నష్టం వస్తోంది. అదే కౌలు రైతు అయితే ఎకరాకు 25 బస్తాల కౌలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మొదటి పంట ఎకరాకు 30 బస్తాల సగటు దిగుబడి వచ్చినా అందులో 25 బస్తాలు కౌలుకే పోతాయి. కాబట్టి మొదటి పంటలో కౌలు రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. రెండో పంటపైనే ఆశలు పెంచుకోవాల్సి వస్తోంది. కోనసీమలో 90 శాతం మంది కౌలు రైతులే. అందుకే వారికి సాగు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. దీంతో ఖరీఫ్ లో వరి సాగుకు రైతులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.
* ఖరీఫ్ లో వరద ….రబీలో నీటి ఎద్దడి
కోనసీమలో ఖరీఫ్ లో వరద నీరు ప్రధాన సమస్య. నెలల తరబడి వరద నీరు పొలాల్లో నిలిచిపోవడం వల్ల ఖరీఫ్ వరి పంట దెబ్బతింటోంది. ఇక రబీలో సాగునీటి సమస్య వేధిస్తోంది. గోదావరిలో జులై నుంచి డిసెంబరు వరకు వరద ఎక్కువగా ఉంటుంది. ఆ తరవాత నీటి ప్రవాహాలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో, కాలువలకు నీటి సరఫరా తగ్గిస్తున్నారు. దీంతో రబీ వరి సాగు చేసే రైతులు కాలువల్లో అడుగున ఉన్న నీటిని పొలాలకు పారించడానికి డీజిల్ ఇంజన్లు పెట్టుకోవాల్సి వస్తోంది. దీని వల్ల ఎకరాకు రూ.6,000 ఖర్చు అదనంగా అవుతోంది. ఖరీఫ్ వరి సాగును వరదలు ముంచెత్తుతుంటే, రబీలో నీటి కొరత కారణంగా వరి సాగు చేయడం ఇబ్బందిగా మారింది.
* మద్దతు ధరల మాయాజాలం
కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలు ప్రకటిస్తుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధరలుంటే ప్రభుత్వమే ఆ పంటలు కొనుగోలు చేస్తుంది. కేంద్రం ప్రకటించిన ధర కన్నా మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తే రైతులు వ్యాపారులకు సరకు అమ్ముకోవచ్చు. ఒకవేళ ధరలు ఆశాజనకంగా లేకుంటే గిట్టుబాటు ధరకు ప్రభుత్వానికి పంటలు అమ్ముకోవచ్చు. వరి పంటకు 75 కేజీల బస్తాకు రూ.1455 మద్దతు ధర దక్కాలి. కానీ రూ.1100 నుంచి రూ.1200 మించి రావడం లేదు. తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదంటూ గిట్టుబాటు ధరల్లో కోతలు వేస్తున్నారు. దీనికితోడు ధాన్యం అమ్మిన తరవాత ఆ డబ్బు కోసం 3 నెలల నుంచి – 6 నెలలు ఆగాల్సి వస్తోంది. దీంతో సాగు కోసం రైతులు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకు వచ్చిన ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన తరవాత కూలీ రేట్లు విపరీతంగా పెరగడంతోపాటు, వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదు. దీంతో రైతులు సకాలంలో వరి నాట్లు పూర్తి చేయలేకపోతున్నారు. కోనసీమలో వరినాట్లు వేయడానికి బీహార్, నేపాల్ నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు కూడా వర్తింపజేయాలనే డిమాండ్ వస్తోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
* సాగర్ ఆయకట్టులోనూ ఇదే పరిస్థితి
పంటల విరామం కోనసీమకే పరిమితం అయిందనుకుంటే పొరపాటే. వరి సాగు చేసే చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద వరి పొలాలను సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. గతంలో సాగర్ ఆయకట్టులో ఎకరాకు 12 బస్తాల కౌలు ఇచ్చి సాగు చేసేవారు. నేడు వరి పొలాల సాగుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలాది ఎకరాల భూమి బీడు వారిపోతోంది. ఎకరాకు కనీసం 4 బస్తాల కౌలు ఇచ్చి సాగు చేసుకోవాలని కోరినా ఎవరూ ముందుకు రావడం లేదని పల్నాడు జిల్లా చాగల్లుకు చెందిన రైతులు వాపోయారు. కోనసీమలో రైతులు మూకుమ్మడిగా ఖరీఫ్ పంటల విరామం ప్రకటించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
* పరిష్కార మార్గాలివే….
చిత్తశుద్ది ఉంటే పరిష్కారం లభిస్తుంది. కోనసీమ రైతుల ముంపు సమస్యను కాలువలు రిపేరు చేయడం ద్వారా పరిష్కరించవచ్చు. అలాగే మద్దతు ధరను ఏటా అరకొరగా వందా యాబై కాకుండా, రైతుకు కొంత మిగులు ఉండేలా పెంచితే వరి సాగుకు మొగ్గు చూపుతారు. కేంద్రం క్రమంగా ఎరువుల రాయితీ భారం తగ్గించుకుంటూ, ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతోంది. ఎరువుల ధరలు రెట్టింపు చేసిన కేంద్రం, మద్దతు ధర మాత్రం కేవలం క్వింటా ధాన్యానికి రూ.100 పెంచి చేతులు దులిపేసుకుంది. యంత్రాలను రాయితీ ధరలపై సరఫరా చేసి కూలీల సమస్యకు చెక్ పెట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. మద్దతు ధరలో కోతలు లేకుండా, సరకు అమ్మిన మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేయాలి. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కేవలం ప్రకటనలకే పరిమితం అయితే పంటల విరామం రాష్ట్రం మొత్తం విస్తరించే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.