పాలకుల ఆస్తులు పెరిగాయి… రాష్ట్ర ఆస్తులు తరిగాయి

• ప్రజల సొమ్ముతో తీసుకొచ్చిన పథకాలకు తండ్రులు, తాతల పేర్లు పెడుతున్నారు
• కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి
• శ్రీ సంజీవయ్య గారి లాంటి వ్యక్తుల్ని గుర్తించలేని పరిస్థితి
• అందుకోసం పోరాడేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ జిల్లాకు వస్తారు
• రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ల మీద సైతం కేసులు పెడుతున్నారు
• ఉద్యోగులను, నిరుద్యోగులను నిండా ముంచారు
• నాయకులు ఓట్లు వేయించుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు
• గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు కూడా లేని దుస్థితి
• శ్రీ పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్రానికి భవిష్యత్తు
• కర్నూలు జిల్లా కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టడం కోసం జనసేన పార్టీ పోరాడుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరికీ అందించడం కోసం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చి పెద్దపాడులో పర్యటిస్తారని చెప్పారు. రాజకీయాల్లో మార్పు కోసం అదే నాంది అన్నారు. ఇప్పుడున్న నాయకులు ప్రజల సొమ్ముతో చేపడుతున్న పథకాలకు సైతం వారి తండ్రులు, తాతలు, కులం పేర్లు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అణగారిన వర్గాల నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తుల్ని ఎందుకు గుర్తించరని ప్రశ్నించారు. మంగళవారం కర్నూలు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సామాన్య ప్రజలను గౌరవించే పరిస్థితి లేదు. ఐఏఎస్ ఆఫీసర్ల మీద సైతం కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారు. రెండున్నరేళ్ల పాలనలో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టడం మినహా ఎవ్వరికీ న్యాయం చేయడం లేదు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. పాలకుల కుటుంబాల ఆస్తులు మాత్రం పెరిపోయాయి. రాష్ట్ర ఆస్తులు తగ్గిపోయాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా సమస్యలే కనబడుతున్నాయి.

  • ఇసుక డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?

రాష్ట్రంలో పాలన ప్రజలను అవమానపర్చే విధంగా సాగుతోంది. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటీ నిలబెట్టుకోలేదు. శ్రీ జగన్ రెడ్డి గారి పాలన వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న మద్యం ధరలు పెంచారు. ఇప్పుడు తగ్గించామని చెబుతూ మోసం చేస్తున్నారు. వేల లారీలు, ట్రక్కుల ఇసుక అమ్ముకుంటున్నారు. ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి చేరుతుందో తెలియదు. ప్రకృతి ఇచ్చిన ఆస్తిని ఈ ప్రభుత్వం తవ్వుకుపోతోంది. ఎక్కడ చూసినా అవినీతి. కర్నూలులో గతంలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు. ఊహించని విధంగా 5 శాతం పేదల ఇళ్ల స్థలాలకు వదలాలంటూ వారిని దెబ్బ కొట్టారు.

  • రైతులు నష్టపోయినా పట్టించుకోరు

ఈ ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వారు లేరు. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద చెక్కులు ఇస్తూ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నట్టు చెబుతున్నారు. రైతులు నష్టపోతే పట్టించుకునే వారు లేరు. కౌలు రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. విద్యార్ధులకు స్కాలర్ షిప్ వ్యవస్థ తీసేశారు. అమ్మ ఒడి పథకం అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి మినహా ఎవ్వరికీ ఉపయోగపడడం లేదు. రాయలసీమ ఇంత వెనుకబడి ఉందంటే అందుకు కారణం నాయకులే. ఓట్లు వేయించుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు. రైతులు పంటలు పండించుకునే పరిస్థితి లేదు. ఎంతో మంది వలసలు పోతున్న పరిస్థితి. శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఇక్కడ గాజులదిన్నె ప్రాజెక్టు, శ్రీకాకుళం కోసం వంశధార ప్రాజెక్టు, కృష్ణా డెల్టా కోసం పులిచింతల ప్రాజెక్టులాంటివి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ రోజుల్లోనే శంకుస్థాపన చేశారు. అలాంటి దార్శనికత నేటి నాయకుల్లో ఏది? నేటి సీఎంని నాటి ముఖ్యమంత్రితో పోలిస్తే ఎంత తేడా ఉంటుంది. నాయకుల పరిస్థితిలో ఎంత తేడా ఉంది. రెండేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, రెండుసార్లు కేంద్ర మంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు అందించిన వ్యక్తి. రాజకీయాల్లో ఒక నిబద్దతతో పని చేశారు. అన్ని పదవులు అలంకరించినా జేబులో వంద రూపాయిలు లేకుండా తిరిగారు. రాజకీయాల్లో పారదర్శకత ఆయన ఇంటిని చూస్తే అర్థం అవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా అలాంటి వ్యక్తిని గుర్తించడం లేదు. ఏడాదికి ఒక్కసారి కలెక్టర్ తో తూతూ మంత్రంగా కార్యక్రమం చేసి మర్చిపోతున్నారు. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లేందుకు శతజయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆ విరాళం ఒక నిర్మాణం కోసం కాదు. శ్రీ సంజీవయ్య గారి స్ఫూర్తిని ప్రతి అణువులో నిలిపే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. బలహీన వర్గాల విద్యార్ధులు చదువుకునే ఏర్పాటు చేయమని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. అదే పెద్దపాడులో ఇప్పుడున్న రాజకీయ నాయకులు నాలుగంతస్తుల మేడలు కట్టుకుంటున్నారు. రూ. 20 కోట్లతో భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలేమో తాగడానికి గుక్కెడు మంచినీరు ఇవ్వండి చాలు అని అడిగే పరిస్థితి.

  • అప్పు చేసిన లక్షల కోట్లను ఏం చేశారు?

జిల్లాలో పరిస్థితులు చూస్తే వలసలు పెరిగిపోయాయి. చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం కూడా లేని పరిస్థితి. అప్పులు తెస్తున్న లక్షల కోట్లు ఏం చేస్తున్నారో తెలియదు. ఎన్నికల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. ఎన్నడూలేని విధంగా కర్నూలు జిల్లా ప్రజలు అన్ని నియోజకవర్గాల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. జిల్లా మంత్రులు చూస్తే ఒక మంత్రి కార్లు కొనుక్కునే పనిలో సంక్షేమం గురించి మర్చిపోయాడు. కార్మికుల గురించి మర్చిపోయాడు. చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నా జిల్లాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో తెలియదు. రేపు ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిసింది. జిల్లా పర్యటనలకు వెళ్లి ఆయన చేస్తుంది ఏంటి ? ఓ మీటింగ్ పెట్టి వరాలు కురిపించడం. వేల కోట్లు ఇస్తున్నామని చెప్పి వెళ్లిపోవడం. ఈ రోజు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఒక రోడ్డుకు శ్రమదానం నిర్వహించాం. రాష్ట్రవ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా గోతులు తప్ప ఏమీ కనబడడం లేదు. కనీసం ముఖ్యమంత్రి గారు పర్యటనకు వచ్చినప్పుడు అయినా గోతులు పూడ్చమని చెప్పాలి. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి ముందు కారు దిగి రోడ్డు వేయమని చెప్పాలి. జనసేన పార్టీ అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఓ రోడ్డుకు శ్రమదానం నిర్వహించి గుంతలు పూడ్చాలని నిర్ణయం తీసుకున్నాం. పోరాట యాత్రలో భాగంగా మూడు సంవత్సరాల క్రితం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇదే కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ సభ నిర్వహించినప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి ఒక మాట చెప్పారు. ఓటు ద్వారా మంచి నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. పరిపాలన దెబ్బ తింటుంది. శ్రీ జగన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మితే ప్రయోజనం ఉండదు అని చెప్పారు. తప్పు జరిగింది. ఈ సారి ఎక్కడ చూసినా యువత ఉత్సాహంతో ఉన్నారు. మోసపోయామన్న కసితో ఉన్నారు. అదే ఉత్సాహంతో శ్రీ జగన్ రెడ్డిని గద్దె దించాలి. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారు ఒక్క మాట నిలబెట్టుకుంది లేదు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లేదు. డీఎస్సీ లేదు. రద్దు చేస్తామన్న సీపీఎస్ రద్దు లేదు. ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద వాగ్దానాలు చేశాడు. రెండున్నరేళ్లు పూర్తయ్యాయి అవన్నీ ఏమయ్యాయో తెలియదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎన్నికల కోసం రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత కోసం వచ్చారు. కర్నూలు జిల్లాలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు సైతం అదే మాట చెబుతున్నారు. చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్ధలకు వెళ్లవద్దు. కష్టపడి పని చేస్తే పార్టీ గుర్తిస్తుంది. నిజాయితీగా ముందుకు వచ్చిన వారిని అందలం ఎక్కించిన ఏకైక పార్టీ జనసేన. ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం రూ. 30 కోట్లు అడిగిన పార్టీలు ఉన్నాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం శ్రీ దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తితో పని చేసే వారిని గుర్తించి ముందుకు తీసుకువస్తారు. ప్రతి ఒక్కరు పార్టీ కోసం కొంత సమయం కేటాయించండి. జనసేన భావజాలాన్ని అర్ధం చేసుకోండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి. పార్టీ కార్యకర్తల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ జనసేన మాత్రమే. ఈ రోజు వివిధ వర్గాలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పేరు పేరునా స్వాగతం పలుకుతున్నాం. మత్స్యకార సంఘాల నుంచి వచ్చిన నాయకులు వారికి జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు జనసేనలో చేరుతున్నట్టు చెబుతున్నారు. రాయలసీమ నుంచి బోయ సోదరులు వచ్చారు. వారు తమ హక్కుల కోసం పోరాడుతుంటే 200 కేసులు పెట్టారు. కేసులు పెట్టినంత మాత్రాన భయపడతామా? ఈ ప్రభుత్వంలో మనమంతా భాగస్వాములమే. మొన్న ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టాం. అదే ధైర్యంతో ముందుకు వెళ్దాం. 2024లో శ్రీ జగన్ రెడ్డిని గద్దె దించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్దాం. భవిష్యత్తులో పార్టీ తరఫున మంచి కార్యక్రమాలు చేసుకుందాం. జిల్లా కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేద్దాం. అనంతరం జిల్లాలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేద్దాం. శ్రీ దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలి అన్నారు.

• జనసేనలోకి భారీగా చేరికలు

శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పర్యటన సందర్భంగా కర్నూలు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. నేషనల్ విమెన్స్ పార్టీకి చెందిన 400 మంది జనసేన కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ ముఖ్యులు శ్రీమతి హసీనా బేగం, మెహబూబ్ పాషా; కర్నూలుకు చెందిన గంగపుత్ర నేత శ్రీ టి. సత్యనారాయణ, శ్రీ టి.శ్రీనివాస్, శ్రీ కృష్ణ, శ్రీ బోస్, శ్రీ శ్రీనివాస్, శ్రీ చంటి; నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన శ్రీ మానపాటి శ్రీనివాస్, శ్రీ వెంకటరమణ, శ్రీ పవన్, శ్రీ శ్రీకాంత్, పాణ్యం నియోజకవర్గానికి చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు శ్రీ బాలు, శ్రీ జగదీష్, శ్రీ హుస్సేన్, శ్రీ ఉదయ్, శ్రీ శివకృష్ణ, శ్రీమతి శ్రీదేవి, నంద్యాల నియోజకవర్గానికి చెందిన శ్రీ భరత్, శ్రీ పవన్, శ్రీ సునీల్, శ్రీ రమేష్, శ్రీ భరత్ తదితరులు జనసేనలో చేరారు. వీరిని శ్రీ మనోహర్ గారు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా నాయకుడు శ్రీ నాయకర్ మల్లప్ప సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పెదపూడి విజయ్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ శ్రీ పాకనాటి గౌతమ్ రాజ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ బేతపూడి విజయ్ శేఖర్, కర్నూలు జిల్లా నాయకులు శ్రీ చింతా సురేష్, శ్రీమతి రేఖా గౌడ్, శ్రీ తెర్నేకల్ వెంకప్ప, శ్రీ లక్ష్మన్న, డా. బాల వెంకట్, శ్రీ అర్షద్, శ్రీ యడవల్లి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.