ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ విఫలం: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, డంపింగ్ యార్డ్ లో తగలబడుతున్న చెత్త కారణంగా స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. స్థానిక ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి రోజూ ఏలూరు నగరంలోని శానిటరీ సిబ్బంది సేకరించిన చెత్తను మున్సిపల్ అధికారులు సేంద్రియ ఎరువులుగా మార్చాల్సినది పోయి డంపింగ్ యార్డు లో తగలబెట్టడం దారుణమన్నారు. దాని కారణంగా వెలువడే పొగ ఆ చుట్టుపక్కల ఉన్న 13, 14 డివిజన్లలో వ్యాప్తి  చెంది అక్కడి ప్రజలు వివిధ రోగాల బారిన పడటంతో పాటు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల అస్వస్థత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు. ప్రజాసమస్యలు పట్టని వైఎస్సార్ సీపీ నేతలు కనీసం స్థానిక ప్రజల ఆరోగ్యం కోసమైనా స్పందించాలన్నారు. మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని)కి ఏమాత్రం మానవత్వం ఉన్నా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డు వద్దకు వచ్చి పరిశీలించి ప్రజల బాధలు తెలుసుకోవాలని సూచించారు.‌ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ సమస్య తేలుస్తామని రెడ్డి అప్పలనాయుడు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, బోండా రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.