స్వమిత్వా యోజనతో జాతీయ స్థాయిలో గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధ్యం

ఏదైనా ఆస్తిపై స్పష్టమైన యాజమాన్య హక్కులను నిలబెట్టే పథకం స్వమిత్వా యోజన అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలాన్ని పెంచిందనీ, ఇది దేశంలోని గ్రామాల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని రాస్తుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ, కొన్ని రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా స్వమిత్వా యోజన విజయవంతంగా అమలు చేసిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది జాతీయ స్థాయిలో అమలు చేయడం జరుగుతుందని ప్రధాని మోడీ చెప్పారు.

“ఇది దేశంలో గ్రామ స్వరాజ్‌కు ఒక ఉదాహరణ అవుతుంది” అని ఆయన అన్నారు. సామాజిక ఆర్థికంగా సాధికారత, స్వయం-ఆధారిత గ్రామీణ భారతదేశాన్ని ప్రోత్సహించడానికి స్వమిత్వా (గ్రామాల సర్వే, గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాపింగ్) పథకాన్ని ప్రధాన మంత్రి ఏప్రిల్ 24, 2020 న కేంద్ర రంగ పథకంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తిపై స్పష్టమైన యాజమాన్యాన్ని స్థాపించడం, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాండ్ పార్సిల్స్ మ్యాపింగ్ చేయడం అదేవిధంగా అర్హులైన కుటుంబాలకు చట్టపరమైన యాజమాన్య కార్డులను జారీ చేయడం ద్వారా హక్కుల రికార్డును అందించడం ఈ పథకం లక్ష్యం.

పైలట్ ప్రాజెక్ట్ కింద, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానా అలాగే కర్ణాటకలో ఈ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ఇప్పుడు, ప్రజలకు ఆస్తి కార్డులను అందించడానికి ఇది దేశమంతటా విస్తరించడం జరుగుతుందని మోడీ చెప్పారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల్లో 22 లక్షల కుటుంబాలకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులు సిద్ధం చేశామని, మధ్యప్రదేశ్‌లో 3 వేలకు పైగా గ్రామాల్లోని 1.70 లక్షల కుటుంబాలకు అందించామని ఆయన చెప్పారు.

స్వమిత్వా యోజన గ్రామస్తులను మూడవ పక్షాల నుండి రుణాలు తీసుకోకుండా కాపాడుతుందని మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు, వారి ఆస్తి పత్రాల ఆధారంగా, వారు బ్యాంకుల నుండి రుణాలు పొందుతారని ఆయన వెల్లడించారు. కొందరు వ్యక్తులు “చోటా హెలికాప్టర్” (చిన్న హెలికాప్టర్) అని పిలిచే డ్రోన్, గ్రామాల అభివృద్ధి రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందని ప్రధాని తెలిపారు.