శ్రీవారి ఆలయం నుంచి సారె

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరాయి. నేడు తిరుచానూరు పంచమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు సారె తీసుకొచ్చారు. పంచమితీర్థం రోజున శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి సారె, కుంకుమ, పసుపు, ఆభరణాలు తీసుకెళ్లడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే గురువారం ఉదయం తిరుమలలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తితిదే అధికారులు.. మంగళవాయిద్యా్ల నడుమ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అక్కడి నుంచి కొవిడ్‌ నిబంధనల మేరకు అలిపిరి మార్గం గుండా టౌన్‌క్లబ్‌, బాలాజీ కాలనీ, ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు, లక్ష్మీపురం, పద్మావతీ నగర్‌ మీదుగా తిరుచానూరు ఆలయానికి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం సారెను తిరుచానూరు ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏకాంతంగా స్నపనతిరుమంజనం, పంచమితీర్థం నిర్వహించారు. ఇవాళ రాత్రికి జరిగే ధ్వజావరోహణతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూనే సంప్రదాయాన్ని కొనసాగించినట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.