దసరాకీ ధరణి పోర్టల్ ప్రారంభం

తెలంగాణరాష్ట్ర  రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టింది. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత.. ధరణి పోర్టల్ అప్ డేట్ చేశారు. అప్ డేట్ చేసిన ధరణి పోర్టల్ ను  సీఎం కేసీఆర్ విజయదశమి రోజున ప్రారంభించబోతున్నారు. ఆ రోజు మంచిరోజు కావడంతో ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ లో సమగ్ర భూ సర్వేతోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భూవివాదాలన్నింటికీ ధరణి పోర్టలే పరిష్కారమని కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి తావులేని విధంగా ఇకపై భూమి రిజిస్ట్రేషన్లన్నీ ధరణి పోర్టల్ ద్వారా జరుగుతాయని భూ యజమాని అనుమతి లేనిదే మార్పులు చేయలేమని అరగంటలో రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ అప్డేషన్ పూర్తవుతుందని చెప్పారు. ధరణి పోర్టల్లో మార్పులు చేసే అధికారం ఎమ్మార్వోలకు కూడా లేదని బయోమెట్రిక్ ఐరిస్ ఆధార్ ఫోటోలతో పకడ్బందీగా ధరణిలో వివరాలు అప్డేట్ అవుతాయని కేసీఆర్ గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించబోతున్నాట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ధరణి పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, బ్యాండ్‌ విడ్త్‌లను సిద్ధం చేస్తున్నారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, మ్యూటేషన్‌ చేయడం, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్‌ చేయడం తదితర విధానాలపై తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్ధార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి డెమో ట్రయల్స్‌ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించనున్నారు.

దసరా లోపు అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్‌లో ఎంటర్‌ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత జరిగే మార్పు చేర్పులు వెంటనే నమోదు చేస్తామని సీఎం చెప్పారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్, రెవెన్యూ వ్యవహారాలు జరగవని స్పష్టం చేశారు.