తెరుచుకున్న శబరిమల ఆలయం..

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి చివరివారంలో మూతబడిన శబరిమల ఆలయం, కఠినమైన కరోనా నిబంధనల నడుమ 7 నెలల తర్వాత తొలిసారిగా శుక్రవారం తెరుచుకుంది. ఆచారం ప్రకారం తులమాస (మండల పూజ) మహోత్సవాల నిర్వహణకు ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. ఆలయ తంత్రి కందారు రాజేవరు సమక్షంలో ప్రధాన పూజారి ఏకే సుధీర్ నంబూతిరి ఆలయ తలుపులు తెరిచారు. కొవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా నేటి 17 నుంచి ఈ నెల 21 వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతించారు. ఇదిలావుండగా శబరిమల అయ్యప్ప ఆలయం, మాలికపురం ఆలయానికి కొత్త ప్రధాన పూజారి ఎంపిక కోసం డ్రా తీశారు. ఈ ప్రక్రియ దేవస్థానం బోర్డు ప్రతినిధులు, కేరళ హైకోర్టు నియమించిన పరిశీలకుడి సమక్షంలో జరిగింది.

ఎంపిక చేసిన పూజారుల బృందం నుంచి తుదిగా డ్రా విధానంలో ఒకరిని ఎంపిక చేశారు. శబరిమల మెల్సంతి పదవికి ఈ సారి తొమ్మిది మంది పూజారులను ఎంపిక చేశారు. వీరిలో ఎంపిక కాబడిన కొత్త మెల్సంతి వచ్చే ఏడాది నవంబర్ 15 వరకు కొనసాగుతారు. ప్రీ-బుకింగ్ ఆధారంగా వర్చువల్ క్యూ విధానంలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. రోజుకు 250 మంది చొప్పున మాత్రమే అనుమతిస్తామని ఆలయ బోర్డు పేర్కొంది.. శబరిమల యాత్రకు ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను భక్తులు విధిగా పాటించాలి.