ఈ నెల 16 నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఈ నెల 16 నుంచి నెలవారీ పూజలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో ఐదు రోజులపాటు జరిగే ఈ పూజలకు భక్తులను అనుమతిస్తామని.. శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. గరిష్టంగా రోజుకు 250 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. కేవలం దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శనివారం రాత్రి నుంచి మొదలవుతుందని వివరించింది.

పంబా ప్రాంతానికి చేరుకునే 48 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన వారికే దర్శన భాగ్యం కల్పించేలా నిర్ణయించారు. భక్తులు పంబకు చేరుకోవడానికి 48 గంటల ముందు పొందిన కోవిడ్‌-19 నెగెటివ్‌ ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావలసి ఉంటుందని తెలిపింది.