సాయి శరణం బాబా శరణు శరణం..

1918 అక్టోబర్ 15వ రోజున సాయిబాబా మహాసమాధి చెందిన రోజు. బాబా సమాధి చెంది వంద సంవత్సరాలు పూర్తి అయ్యాయి. షిరిడిసంస్థాన్ వారు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు, శతాబ్ది ఉత్సవాలలో బాగంగా సేవను ప్రధానఅంశంగా తీసుకుని ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించారు. సేవాకార్యక్రమాలకు మూడువేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిoచి వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించిoది షిరిడిసంస్థాన్.  శతాబ్ది ఉత్సవాలకు 4 కోట్ల మందికి పైగా భక్తులు షిరిడిని సందర్శించారు,

షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఈ భౌతిక దేహానంతరం సహితం  నేను ప్రమత్తుడనే.   మీ బారాన్ని నా ఫై  వేయండి నేను మోస్తాను, నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించడమే నా కర్తవ్యం. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు పలికిన మాటలివి. ఇన్నేళ్లలో ఆ మాటలపై భక్తులకు నమ్మకం ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చింది ఎంత అద్భుతం.

150 ఏళ్ల క్రిందట షిరిడి గ్రామం ఒకటి ఉందన్న విషయం మహారాష్ట్రలోనే  చాలామందికి తెలియదు. బాబా అడుగుపెట్టాక ఆ ఊరు వెలుగులోకి వచ్చింది. అది ఎంత అంటే ఆ కాంతి ప్రపంచమంతా ప్రసరించే అంత. కొన్నేళ్లలోనే షిరిడి ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటైoది. ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన హిందూ ఆలయాలలో మూడో స్థానానికి చేరుకుంది. ఆయన నివాసం ఒక పాడు పడిన మసీదు మరి ఇప్పుడు పిలిస్తే పలికే ఆ దైవానికి ఊరూర ఆలయాలే. వాడ వాడలా భక్తులే. నా భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు నా దగ్గరికి రప్పించు కుంటాను అని చెప్పే సాయి నాథునికి భారత దేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో ఎందరో భక్తులు ఉన్నారు.

సదానింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుధా స్రావినo తిక్త మప్య ప్రియంతం
తరుంకల్ప వృక్షాధికం సాదయంతం
నమామీశ్వరం సద్గురుo సాయినాథo

వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటేనే  ఆ వేపచెట్టు ఆకుల్లో  చేదు పోయింది. అలాంటిది ఆయనను  మనసులో నిలుపుకుంటే మన కష్టాలు తొలగి పోవడం ఎంతసేపు అన్నది ఈ శ్లోకంలోని భావం. షిరిడి వాసులు బాబాను తొలిసారి చూసింది ప్రస్తుతం సాయినాధుని సమాధి మందిరం వెనుక ఉన్న వేపచెట్టు కిందే. పదహారేళ్ళ వయసులో ఆ చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ తొలిసారి ప్రజలకు దర్శనమిచ్చారు. పగలూ రేయి ఎండా వానలను లెక్కచేయకుండా ఎప్పుడూ  ధ్యానంలోనే మునిగి ఉన్న ఈ బాలకుడు ఎవరో ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడో వారికి అంతుపట్టలేదు. అతడి చుట్టూ చేరి వివరాలు అడగడం మొదలు పెట్టారు. ఎవరు ఏది అడిగినా బాబా బదులు చెప్పేవారు కాదు ధ్యానంలో నుంచి దృష్టిని మరల్చే వారు కాదు. అయితే గ్రామస్తులు అదే పనిగా విసిగిస్తూ ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నాలుగేళ్లకు దూప్ గ్రామ మునసబు చాంద్ పాటిల్ కు పకీరు వేషధారణలో అడవి లో కనిపించారు. తప్పిపోయిన తన గుర్రాన్ని   వెతుక్కుంటూ తిరుగుతున్న అతడికి గుర్రం జాడ తెలుపడంతో పాటు, చూస్తుండగానే చేతిలో ఉన్న సటకా  తో నేలమీద కొట్టి హుక్కా వెలిగించడానికి కావలసిన నీటిని, నిప్పుని పుట్టించారు. అంతే పాటిల్ కు ఆ పకీరు సామాన్యుడు కాదని అర్థమైపోయింది. వెంటనే బాబా ని తన ఇంటికి అతిథిగా రమ్మని వేడుకుని వెంట తీసుకెళ్లాడు. కొంతకాలానికి పాటిల్ బావమరిది  పెళ్లి కుదిరింది. వదువుది షిరిడి గ్రామం. అలా పెళ్ళివారితో కలిసి మంగళవాయిద్యాల మధ్య 1858లో రెండోసారి షిరిడి గ్రామం లో అడుగుపెట్టారు బాబా. ఆ మారుమూల పల్లె ఆధ్యాత్మికoగా ఎదిగేందుకు పునాది పడిన రోజది. బాబా పాద దుళికే ఆ గాలి పులకరించి  పోయింది  కండోబా ఆలయం దగ్గర బండి దిగిన పకీరు ను చూస్తూనే ఆలయ పూజారి మహాల్సాపతి సాయి సాయి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటి వరకూ  ఆయన పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆనాడు ఆ పూజారి నోటి నుంచి వచ్చిన ఆ నామమే జగత్ ప్రసిద్ధమైపోయింది, ఆ పేరుతోనే షిరిడి పవిత్ర పుణ్యక్షేత్రమై వర్ధిల్లుతోంది. కల్యాణ వేడుక కోసం వచ్చిన బాబా జగత్ కళ్యాణం కోసం తాను చేయాల్సింది మిగిలిపోయింది అనుకున్నారో ఏమో! వెళ్లి వారితో తిరిగి వెళ్లలేదు. అప్పటినుంచి షిరిడీలోని మసీదు ఆయన నివాసం అయింది. పకీరు వేషధారణ మసీదులో  నివాసం అనుక్షణం అల్లా మాలిక్ (అల్లానే ప్రబువు) అని అంటుండేవారు. అంటే కచ్చితంగా ముసల్మానే అంటూ స్థానికులు బాబాకు మతాన్ని ఆపాధించడం మొదలుపెట్టారు. తాను ఏ ఒక్క మతానికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవడం బాబాకు నచ్చలేదు. వెంటనే మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టడం తో పాటు, లోపల తులసి మొక్కలు నాటారు.  నిత్యాగ్నిహోత్రాన్ని  ఏర్పాటు చేసి రోజూ  మసీదు లో దీపాలు వెలిగించడం ప్రారంభించారు. తనకు అన్ని మతాలు సమానమే అని చాటారు  ఇలా కుల మతాల గురించే కాదు మంచి, చెడు, జాలి, దయ, త్యాగం, దానం, ఆద్యాత్మికత, ఆనందం ఇలా ఎన్నో విషయాల గురించి దాదాపు అరవై వసంతాలు ఆచరణ పూర్వకంగా చూపించి సమర్థ సద్గురువు అయ్యారు సాయిబాబా. ఎలాంటి రోగమైనా బాబాని తలుచుకుంటే వెంటనే నయం అయిపోతుంది అని నమ్ముతారు భక్తులు. షిరిడి వెళ్లిన తొలిరోజుల్లో మామూలు వైద్యుడిలా  భక్తులకు సేవలు చేసేవారు. గ్రామంలో సందర్భాన్ని బట్టి ఆయుర్వేద వైద్యం చేసే వారట. కొద్ది కాలంలోనే ఆయన గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చింది. అయితే మొదట్లో కొద్దిమంది మాత్రమే బాబా దైవాంశ సంభూతులు అని నమ్మేవారు. ఒకసారి జరిగిన సంఘటనలో  ఆయన అవతార పురుషుని నమ్మకం అందరికి కలిగింది. దీపాలు వెలిగించేందుకు బాబా రోజు గ్రామంలోని వ్యాపారుల దగ్గర నూనె అడిగి తెచ్చే వారు. కానీ ఓ రోజు అందరూ కూడబలుక్కొని సాయిబాబాకు నూనే ఇవ్వడానికి నిరాకరించారు. సద్గురువు మారు మాట్లాడ లేదు. మసీదుకు చేరుకొని ఒక రేకుడబ్బా, నీరు తీసుకుని కొంచెం నీటిని పుక్కిలించి అందులో ఊశారు. తర్వాత ఆ నీటినే ప్రమిదలలో పోసి వత్తులు వేసి వెలిగించారు. అవి రోజు కన్నా కాంతి వంతంగా వెలిగాయట. ఆరోజు నుండి షిరిడి వాసులకు  సాయి బాబా దేవుడు అయ్యాడు. సాయి బాబాతో కలసి ఉన్న వారు ఆయన మహిమలను కళ్లారా చూసిన వారి అనుభవాలతో వ్రాసిన సాయి  సత్ చరిత్ర’లో బాబా జీవితంలో జరిగిన ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి.

 స్వయంగా వండి పెట్టేవారు :

బాబా దినచర్య విషయానికి వస్తే రోజు ముఖ ప్రక్షాళన చేసుకున్న తర్వాత దునిలో కట్టెలు వేసి పలహారం సమయానికి భుజానికి జోలె చేతిలో భిక్షపాత్ర పట్టుకొని అయిదు ఇళ్ళకు బిక్షకు వెళ్ళేవారు. కాసేపటికి  లెండి వనానికి వెళ్లి వామనతాత్య అనే భక్తుడు ఇచ్చే రెండు పచ్చికుండలతో  మొక్కలకు  నీళ్ళు తోడి పోసేవారు. సాయిబాబానే స్వయంగా రకరకాల మొక్కలను లెండి వనంలో నాటి పెంచేవారట.  తర్వాత ద్వారకామాయిలో భక్తులతో గడిపి మద్యాహనానికి  మరోసారి బిక్షకు వెళ్ళేవారు. బిక్షలో దొరికిన పదార్ధాలను రెండు పాత్రల్లో  వేసేవారు. ఒక పాత్ర లోనివి మసీదు తుడిచే మహిళా, భక్తులు తీసుకెళ్ళేవారు. మరొక పాత్రలోని వాటిని కుక్కలు, పిల్లులు, కాకులు యధేచ్చగా తినేవి. నిజానికి బాబాకోసం భక్తులు ఎన్నో రకాల పిండి వంటలు, పలహారాలు తీసుకువచ్చే వారు అయినా ఆయన చివరి రోజు వరకు బిక్షాటన మానలేదు.   తన దగ్గరకు  ధనవంతులు వచ్చినా బీదవారు  వచ్చినా  ఒకేలా చూసే వారు. అందరూ సమానమే అనే వారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సద్గురు సాయిని దర్శించుకునేందుకు వచ్చే వారు. అలాంటి వారు ఇచ్చిన డబ్బును పేద భక్తులకు రోజుకి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు చొప్పున పoఛిపెట్టే  వారు ఇంకా మిగిలితే ఆ సొమ్ముతో స్థానికంగా ఉన్న ఆలయాలకు మరమ్మతులు పేదవారికి అన్నదానాలు చేయించేవారు, ఒక్కోసారి తనే స్వయంగా వండి వడ్డించే వారు.

 భౌతిక దేహాన్ని విడిచి వెళ్లారు:

షిరిడి లో దాదాపు 60 యేళ్ళు నివసించిన బాబా 1918 సoవత్సరంలో దసరా రోజున భౌతిక దేహాన్ని విడిచి వెళ్లారు, సమాధి చెందడానికి కొన్ని నెలల ముందు దగ్గర భక్తుడు కోటీశ్వరుడు అయిన బాబాసాహెబ్ బూటికి చక్కని భవనం ఒకటి కట్టించమని బాబా చెప్పినట్లు కల వచిందట. అది సాయినాథుడి ఆజ్ఞగా బావించి పనులు మొదలు పెట్టాడు బూటి. భవనం పనులు పూర్తి కావచ్చేసరికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సాయి భక్తురాలైన బాయిజ బాయి కొడుకు తాత్యా  అనారోగ్యంతో మంచం పట్టాడు. చిన్నతనం నుంచి బాబాను మామా అంటూ ఎన్నో ఏళ్ల పాటు ఆయనతో పాటు మసీదులోనే  నిద్రించాడు. అతడు అనారోగ్యం గురించి తెలిసి ఒకరోజు బాబా అతని తీసుకు రమ్మని కబురు పంపించారు. అతికష్టంమీద మసీదులో అడుగుపెట్టిన తాత్యాని చూసి నీకేం కాదు, నీబదులు నేను వెళ్తాను అని చెప్పారట. బాబా మాటలు అపుడు ఎవరికీ అర్థం కాలేదు కానీ ఆతర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దసరా రోజుకి  సాయిబాబా పూర్తిగా నీరసించిపోయారు చివరికి నాకు ఇక్కడ బాగోలేదు బూటీకట్టించిన భవనంలోకి తీసుకెళ్ళమంటూ పక్కకు ఒరిగిపోయారు. తర్వాత సద్గురు సాయి చెప్పిన ప్రకారం బూటీ వాడాలోని మందిరంలో సమాధిచేశారు. అదే ఇప్పటి షిర్డి ఆలయం. సమాధి ఫైనున్న నిలువెత్తు విగ్రహాన్ని  ఆ తర్వాత 36 ఏళ్ళకు ప్రతిష్టించారు.

 బోధనలు:

తానెక్కడినుంచి వచ్చాడు.. తన తల్లిదండ్రులు ఎవరు అన్న వివరాలు బాబా తన జీవిత కాలంలో ఎప్పుడూ చెప్పలేదు. ఆయన దగ్గర కుల మతాల ప్రస్తావన తెచ్చినా బాగా కోప్పడే వారు. ఎప్పుడూ సబ్కా మాలిక్ ఏక్ హై (అందరి ప్రభువు ఒక్కడే) అనే వారు. ఆయన శ్రీరామనవమి పండుగను శాస్త్రోక్తయుక్తంగా జరిపించే వారు. అదే సమయంలో ఈదుల్ పీతల్ పండుగ నాడు మసీదులో నమాజు చేయించేవారు. ఒకసారి సాయిబాబా ఓ ఇంటి ఫై కప్పు ఎక్కడానికి ఒక నిచ్చెన తీసుకు రమ్మన్నారు. నిచ్చెన తీసుకు వచ్చిన కుర్రాడికి రెండు రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో రెండు రూపాయలు అంటే చాలా ఎక్కువ. అంత ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అందరూ అడిగారు. దానికి సాయిబాబా మనం ఎవరితోనైనా పనులు చేయించుకుంటే వారికి సరైన కూలీ ఇవ్వాలి. లేకపోతే రుణపడిపోతాం అన్నారట. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే,  దాహంతో ఉన్నవారికి నీళ్లు, పేదవారికి బట్టలు, అలసిపోయి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడానికి నీ అరుగు మీద కొంచెం చోటు ఇస్తే భక్తీతో నన్ను సేవించినట్లే అని చెప్పేవారు సద్గురు సాయి. దేవుడిని మెప్పించాలంటే పెద్ద పెద్ద పూజలు  చేయనక్కరలేదు ఉపవాసాలు ఉండనక్కర లేదు శ్రద్ద సబూరి (సహనం) ఉంటే చాలన్నది బాబా వాక్కు. ఒకసారి ఒక మహిళ సాయినాధుని భోజనానికి రమ్మని పిలిచిoది. సరే అని మాట ఇచ్హారు బాబా. భోజన సమయానికి పదార్థాలన్నీ ఒక చోట పెట్టి బాబా ఇంకా రావడం లేదని చూస్తుండగా, ఆకలితో ఉన్న కుక్క వచ్చి చూస్తూ నిలబడిoదట. అది చూసి ఆ మహిళ ఆ కుక్కను కర్రతో కొట్టింది. తర్వాత బాబాదగ్గరకు వెళ్లి మీ కోసం ఎదురు చూశాను, భోజనానికి ఎందుకు రాలేదని అడుగగా. నేను వచ్చాను నువ్వే నన్ను కొట్టి తరిమేసావు అన్నారట.  అలా బాబా సర్వజీవులలోను తానే ఉంటానని బోదించారు ఆ సర్వాంతర్యామి.  ఇతరుల గురించి చెడుగా  మాట్లాడినా సాయిబాబా సహించేవారు కాదు. బాబా బక్తులలో ఒక వ్యక్తి వాడా లో కూర్చొని  ఎప్పుడు మరో భక్తుడు గురించి చెడుగా మాట్లాడేవాడు. ఓరోజు సద్గురువు అతన్ని పిలచి.. పంది అందరూ అసహ్యించుకునే అసుద్దాన్నీ ఇష్టంగా తింటుంది, అలాగే నువ్వు తోటి వారి గురించి చెడుగా మాట్లాడి  వారు చేసుకున్న పాపాలను కడుగుతున్నావ్ అన్నారు. మనం తోటి వారి గురించి చెడుగా మాట్లాడితే నీ నాలుకతో వారు చేసుకున్న పాపాలను  శుభ్రం చేస్తున్నట్లే అన్నారు. మనం ఒకరిని నిందించినా.. వాళ్లు చేసిన చెడ్డ పనుల గురించి అదేపనిగా మాట్లాడినా వారి పాపాన్ని మనం శుభ్రం చేస్తున్నట్లే అన్నది బాబా  మాట. భక్తులు ఎన్ని కానుకలు ఇచ్చినా సాయినాధుడు అవేవి  తనవి కాదని భిక్షపాత్ర, జోలె, సటకా మాత్రమే తన ఆస్తులని చెప్పేవారు. సంపాదించిన కొలది  కోరికలు పెరుగుతాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి కష్టాలు పెరుగుతాయి. అందుకే వైరాగ్యంతో జీవించడానికి మించిన సంతోషం ఉండదు అని బోధించే వారు. ఇలా తన జీవిత కాలంలో భక్తులకు ఎన్నో బోధనలు.. ప్రేమతత్వం మానవత్వమే  సాయితత్వం. బాబా భౌతిక దేహాన్ని విడువక  ముందు తర్వాత కూడా భక్తులను నడిపిస్తున్న మార్గం అదే. అందుకే భక్తులకు బాబా దైవం మాత్రమే కాదు. తల్లి, తండ్రి, గురువు, నేస్తం అన్నీ.. ఆ అనుబంధంతోనే కోట్లాది భక్తులు బాబాను గుండెల్లో నిలుపుకున్నారు.

షిరిడి లో పూజా విధానం:

బాబా జీవించి ఉన్నప్పుడు ప్రారంభమైన హారతి పూజలు ఇప్పటికీ షిరిడీలో కొనసాగుతున్నాయి. ఉదయం 4 గంటల 30 నిమిషాలకు  బాబాను నిద్ర లేపుతూ కాకడ హారతినిస్తారు పూజారులు. అప్పటికే భక్తులు దర్శనానికి క్యూ లో నిలబడి ఉంటారు. కాకడ హారతి  ముగిసాక మంగళ స్నానం చేయిస్తారు. అనంతరం షోడశోపచార పూజ ఉంటుంది. తొమ్మిదింటికి అభిషేక పూజ, మధ్యాహ్నం 12 గంటలకు మద్యాహన హారతి ఇస్తారు. సూర్యాస్తమయ సమయంలో రాత్రి 10 గంటల 30 నిమిషాలకు పూజను నిర్వహించి 11 గంటలకు ఆలయాన్ని మూసేస్తారు. పండగ సమయాల్లో ఇతర ప్రత్యేక పూజలు ఉంటాయి. పూజలే కాదు బాబా సజీవంగా ఉన్నారు అనే భావనతో నిత్యం సాయినాధునికి రకరకాల సేవలు నిర్వహిస్తారు. రోజు ఉదయం సద్గురువుకు వేడినీళ్ల స్నానం చేయిస్తారు, బాబా పక్కన ఓ గ్లాసు నీటిని ఉంచడంతో పాటు.. పొద్దున్నే అల్పాహారం మధ్యాహ్నం రాత్రి పూట భోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగుసార్లు హారతి ఇచ్చే ముందు బాబా విగ్రహం మీద ఉన్న వస్త్రాన్ని మార్చుతారు. రాత్రిపూట ఆలయాన్ని మూసే టప్పుడు సాయినాథుడు చుట్టూ దోమ తెరలు కట్టి, సమాధి మీద తెల్లటి వస్త్రాన్ని కప్పుతారు.

సాయిబాబాకు స్వయంగా ఓ ఎఫ్ ఎం స్టేషన్ వుంది. ప్రసార భారతి ఆధ్వర్యంలో షిరిడీ లో ఈ ఏడాది ఏర్పాటైన రేడియోలో చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడికి వచ్చే భక్తులు రోజంతా సాయి బాబా హారతులు భజనలు భక్తి పాటలు వినొచ్చు, ఇలా ప్రత్యేకంగా ఓ రేడియో స్టేషన్ కలిగిన దేవాలయాలు మన దేశంలో తిరుమల, షిరిడి రెండే ఉన్నాయి. 2008లో భారత తపాలా శాఖ సాయిబాబా గౌరవార్థం ఐదు రూపాయల స్టాంపును విడుదల చేసింది. మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ లలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విదేశాల నుంచి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ, మలేషియా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ మరియు సింగపూర్ లాంటి దేశాల్లోనూ షిరిడి సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద సాయి బాబా విగ్రహం ఉంది. ఇక్కడ బాబా 116 అడుగుల ఎత్తులో కొలువై ఉన్నారు.