తమ్ముడికి భరోసానిస్తూ అన్న సాయితేజ్ లేఖ..

సాయి తేజ్, వైష్ణవ్‌ తేజ్‌.. వీళ్లద్దరిని చూస్తుంటే.. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లను చూసినట్టు అనిపిస్తుంది. పవన్‌ కెరీర్‌ మొదట్లో.. చిరు ఎలా దైర్యం చెప్పాడో.. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌కు కూడా సాయి ధరమ్ తేజ్‌ అలా దైర్యం చెబుతూ ఓ లెటర్‌ రాసి ట్విట్టర్‌ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లెటర్‌ను చూసినవారికి కాస్త ఎమోషనల్‌ టచ్‌ను ఇస్తోంది.

“నువ్వు కథానాయకుడిగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్.. నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉందిరా!! నిన్ననే నిన్ను చిన్నపిల్లాడిగా చేతుల్లోకి తీసుకున్నట్లు ఉంది. అప్పుడే నువ్వు ఎదిగిపోయావు.. వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యావు. నువ్వు కూడా ఎంతో సంతోషంగా, భయంగా ఉన్నావని నాకు తెలుసు! నిన్ను చూస్తుంటే.. నా మొదటి చిత్రం విడుదలైనప్పుడు నేను ఏ విధంగా కంగారుపడ్డానో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇండస్ట్రీలో నీ కెరీర్‌ ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇప్పటి నుంచి నీ ఈ ప్రయాణం ఎలాంటి కష్టాలు లేకుండా సులువుగానే సాగుతుందని నేను మాట ఇవ్వలేను. కానీ, నీ కష్టానికి తగిన ప్రేమాభిమానాలను ప్రేక్షకులు నీకు అందిస్తారు. నీతోపాటు మా అందరికీ ఈ రోజు ఎంతో విశేషమైనది. ‘ఉప్పెన’ నీకు మంచి విజయాన్ని అందించాలని ఆశిస్తున్నా! వెండితెరపై నిన్ను చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని సాయితేజ్‌ ఆ లెటర్‌లో రాసుకొచ్చాడు. ఇక బుచ్చి బాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఉప్పెన.. రిలీజై అందరినీ ఆకట్టుకుంటోంది. రిలీజైన అన్ని థియేటర్లో సూపర్‌ ఓపెనింగ్స్‌ తో కలెక్షన్లు రాబడుతోంది.