బ్యాలెట్‌ పత్రాలు మాయం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్‌లో కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్‌ పత్రాలు అపహరణకు గురయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డలో గ్రామపంచాయతీ 8 వ వార్డులోహొ బ్యాలెట్‌ పత్రాలు అపహరణకు గురయ్యాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రి బ్యాలెట్‌ పత్రాలు అపహరించారు. దీంతో ఎన్నికల సిబ్బంది జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే మొదటి విడతలో కూడా బ్యాలెట్‌ పత్రాలు అపహరణకు గురయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో నేడు రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి కందరాడలో కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు అక్రమంగా కేంద్రంలోకి చొరబడి చివరి రౌండ్‌ బ్యాలెట్‌ పత్రాలను ఎత్తుకెళ్లారు. దీంతో తనకు అన్యాయం జరిగిందని టీడీపీ మద్దతుదారులు, అభ్యర్థి పిల్ల సుశీల ఆందోళనకు దిగారు. తననే విజేతగా ప్రకటించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయితే కౌంటింగ్‌ జరుగకుండా సర్పంచ్‌ను ప్రకటించలేమంటూ అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. అయితే బుధవారం ఉదయం 6 గంటలకు రీకౌంటింగ్‌ నిర్వహించి పోలైన ఓట్లను సరి చూశారు. సుమారు 43 బ్యాలెట్‌ పత్రాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. దీంతో శనివారం రీపోలింగ్‌కు అధికారులు ఆదేశించారు.