పాకిస్థాన్‌కి షాక్ ఇచ్చిన సౌది అరేబియా

పాకిస్థాన్‌కి సౌది అరేబియా భారీ షాక్ ఇచ్చింది. పాకిస్తాన్‌కి ఇకపై రుణాలు ఇవ్వడం కానీ లేదా పెట్రోలియం సరఫరా చేయడం కానీ కుదరదని తేల్చిచెప్పేసింది. సౌది అరేబియా తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య దశాబ్ధం తరబడిగా కొనసాగుతున్న స్నేహబంధం ముగిసినట్టయిందని మిడిల్ ఈస్ట్ మానిటర్ పేర్కొంది. జమ్ముకశ్మీర్ విషయంలో ఇస్లామిక్ దేశాలన్నీ భారత్‌ని వ్యతిరేకించాలని, తమ వైఖరిని స్పష్టం చేయాలని పేర్కొంటూ పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి షా మెహ్మూద్ ఖురేషి ఇస్లామిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్ ని హెచ్చరించిన నేపథ్యంలో ఆ ఆర్గనైజేషన్‌కి నేతృత్వం వహిస్తున్న సౌది అరేబియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్‌లో సభ్యత్వం ఉన్న దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులంతా సమావేశమై కశ్మీర్ అంశంపై ఓ నిర్ణయం తీసుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడి ఇస్లాంను అణిచివేస్తున్నారని… ఈ విషయంలో ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమవ్వాలని పాకిస్తాన్ తమ మిత్ర దేశాలతో పోరు పెట్టుకుంటోంది.

ఐతే కశ్మీర్ విషయంలో భారత్‌పై పాకిస్థాన్‌ చెబుతున్న మాటలను ఐఓసి సభ్యదేశాలు విశ్వసించేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. అమెరికాకు మాల్దీవుల శాశ్వత రాయబారిగా ఉన్న తిల్మీజా హుస్సేన్ ఈ అంశంపై స్పందిస్తూ.. ఇండియా విషయంలో ఇస్లామోఫోబియా సరికాదని అన్నారు. అలా చేయడం అనేది దక్షిణ ఆసియాలో అశాంతికి హేతువు అవుతుందని ఆమె హెచ్చరించారు. భారత్‌లో శతాబ్ధాల తరబడిగా ఇస్లాం అనేది ఒక భాగమైపోయిందని.. అంతేకాకుండా భారత్‌లో ఇస్లాం అనేది రెండో అతి పెద్ద మతంగా ఉందని చెబుతూ మొత్తం దేశ జనాభాలో 14.2 శాతం ఇస్లాం జనాభా ఉందని ఆమె గుర్తుచేశారు.