స్కూళ్లు తెరిచే అవకాశమే లేదు: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి

ఢిల్లీలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే అవకాశమే లేదని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. ఈ సమయంలో తల్లిదండ్రులెవరూ తమ పిల్లల ఆరోగ్యం గురించి రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు స్కూళ్లు మూసే ఉంటాయని గత నెల చివర్లో ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ అందుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా చెప్పారు. స్కూళ్లు తెరవకూడదనే వాళ్లు కోరుతున్నట్లు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీలో మరోసారి కరోసా విజృంభిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు లక్ష కేసులు నమోదయ్యాయి. చలికాలం, పైగా వరుస పండుగల నేపథ్యంలో కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం ఉన్నదని మొదటి నుంచీ వైద్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పైగా పంజాబ్‌, హర్యానాల్లో పంటల దహనం సమస్య ఢిల్లీకి ఎలాగూ ఉంది. ఈ సమస్యను ప్రధానితో సమావేశం సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించారు.