లోటస్ పాండ్‌లోని ఏపీ సీఎం జగన్ ఇంటికి భద్రత

హైదరాబాద్ లో లోటస్ పాండ్‌లో ఉన్న ఏపీ సీఎం జగన్ నివాసం ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునిస్తూ.. బుధవారం ఉదయం 11.30 గంటలకు ముట్టడిస్తామని ప్రకటించాయి. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆ రాష్ట్ర మంత్రి కొడాలి వేంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బజరంగ్ దళ్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సీఎం ఇంటికి దాదాపు 300 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. ఇంటికి 200 మీటర్ల దూరంలోనే బారీకేడ్స్ ఏర్పాటు చేశారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం.. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని కావడంతో పోలీసుల అలెర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా పరిస్థితిని సమీక్షాస్తున్నారు.