పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఏడో దశ పోలింగ్

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఈ ఉదయం ఏడు గంటలకు ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 284 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 86 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఆరు విడతల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 796 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా, ఈ దశలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన భవానీపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీఎంసీ తరపున శోభనాదేబ్ ఛటోపాద్యాయ్ బరిలోకి దిగారు. మన్మథనాథ్ నందన్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.