ఇంద్రకీలాద్రిలో ప్రారంభమైన శాకాంబరీ ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో గురువారం శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారిని ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అలంకరించారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి చైర్మెన్‌ సోమినాయుడితో పసుపు కుంకుమ చల్లించి శాస్త్రోక్తంగా అలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాలు 24వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆషాఢమాసం సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నది. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.