సాక్షి మీడియాపై షర్మిల ఆగ్రహం

తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య అభిప్రాయబేధాలు మరోసారి మీడియా సాక్షిగా బయటపడ్డాయి. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష జగన్-షర్మిల మధ్య ఉన్న గ్యాప్‌ను బయటపెట్టింది.

ఈ దీక్ష సమయంలోనే ఆశ్చర్యకమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇందిరా పార్క్ వద్ద షర్మిల మైక్ తో ప్రసంగిస్తుండగా మీడియా చానెల్స్ అన్నీ ఆమె ఎదురుగా మోహరించాయి. అయితే ప్రజలు కనిపించడం లేదని పక్కకు జరగాలని షర్మిల మీడియా చానెల్స్ వారికి సూచించింది. అయితే ఇంతలో అక్కడే ఉన్న సాక్షి టీవీ వాళ్లు.. ‘మేడం మేం సాక్షి’ అనేశారు. దీనికి సర్రుమన్న షర్మిల సాక్షి చానెల్ కు చురకలు వేశారు. ‘కవర్ చేసింది చాల్లేమా.. ఎలాగూ సాక్షి మా కవరేట్ ఇవ్వదుగా’ అంటూ సెటైర్ వేసింది.అయితే కొడుకు జగన్ చేతుల్లోని సాక్షి చానెల్ పై కూతురు షర్మిల అలా అనేసరికి పక్కనే ఉన్న విజయమ్మ షాక్ అయిపోయారు. వెంటనే తేరుకొని షర్మిలను మెల్లగా చేత్తో తట్టారు. అలా అనొద్దు అన్నట్టుగా సైగ చేశారు.

దీన్ని బట్టి అన్నయ్య జగన్ తో షర్మిలకు అభిప్రాయబేధాలు ఉన్నాయని.. సొంత సాక్షి చానెల్ లోనూ షర్మిలకు హైప్ ఇవ్వడం లేదన్న సంగతి తెలియవచ్చిందని అక్కడి మీడియా వర్గాలు గుసగుసలాడుకున్నాయి. ఇది అక్కడ చర్చనీయాంశమైంది.