శ్రీ హరిరామ జోగయ్య అనుకున్నది సాధిస్తారు

•ఫోన్లో చేగొండి హరిరామ జోగయ్యతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
•వయసురీత్యా దీక్ష విరమించాలని సూచన… సానుకూల స్పందన

బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల.. రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య గారు అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) రిజర్వేషన్లు కాపులకు వర్తింపచేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్షకు సయామత్తం అవుతున్న హరిరామ జోగయ్య గారిని ముందుగానే ప్రభుత్వం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిందనే వార్తను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సోమవారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లో హరిరామ జోగయ్య ని పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం నిరాకరిస్తూ దీక్షను కొనసాగిస్తున్న ఆయన్ని, వయసురీత్యా వెంటనే దీక్షను విరమించాలని, మందులు వేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యయుతంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాడుదామని చెప్పారు. దయచేసి దీక్ష విరమించాలని, ఆశయ సాధన కోసం కలిసి కూర్చొని ఎలా ముందుకు వెళ్లాలో చర్చిద్దామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ సూచనలకు సానుకూలంగా స్పందించారు. దమననీతిని అనుసరిస్తున్న ఈ ప్రభుత్వంపై బలంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
•వైఎస్సార్ పాలనలో శ్రీ జోగయ్య ఇంటిపై దాడి
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘2008లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ హరిరామ జోగయ్య గారి కుటుంబం మీద దాడి చేయించింది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించారనే కారణంతో శ్రీ జోగయ్య గారి సతీమణి ఇంట్లో ఉన్న సమయంలోనే దాడి జరిగింది. అవన్నీ తట్టుకొని నిలబడిన గొప్ప పోరాట యోధుడు ఆయన. వారితో నాకున్న అనుబంధం చాలా విలువైంది. పదవులపై ఎలాంటి ఆపేక్ష లేకుండా, నిస్వార్థంగా రాజకీయాలు చేయగల సమర్థత ఆయన సొంతం. ఆయన విలువైన సూచనలు, సలహాలు మాకు ఎంతో అవసరం. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కచ్చితంగా అలుపెరుగని పోరాటం చేస్తాం. ఓ బృహత్తర కార్యం సాధించాలని మళ్లీ ఈ వయసులో పోరాటబరిలోకి దిగిన హరిరామ జోగయ్య స్ఫూర్తి సదా అనుసరణీయం” అన్నారు. ఆశయాన్ని సాధించి చూపించేందుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనీ, తాత్కాలికంగా అయినా ఆమరణ దీక్షను విరమించి, తర్వాత అందరితో చర్చించి, ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలనీ హరిరామ జోగయ్య గారిని కోరారు.