ఇండియాలో గణనీయంగా తగ్గిన కరోనా ఉధృతి, నిలకడగా మరణాల సంఖ్య

కరోనా మహమ్మారి దేశంలో నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. మరణాల సంఖ్య నిలకడగా ఉండగా..కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు కరోనా పాజిటివిటీ రేటు సైతం తగ్గుతోంది.

దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్, కర్ఫ్యూ ఫలితంగా కేసుల సంఖ్య తగ్గుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం ఇంకా తగ్గడం లేదు. కాస్త నిలకడగా ఉందని చెప్పవచ్చు. గత 24 గంటల్లో 1 లక్షా 73 వేల 790 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమంయలో 3 వేల 617 మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య తగ్గనంతవరకూ కరోనా అదుపులో రానట్టే.

గత 24 గంటల్లో దేశంలో 2 లక్షల 84 వేల 601 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలో 2 కోట్ల 77 లక్షల 29 వేల 247 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం దేశంలో 22 లక్షల 28 వేల 747 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 2 కోట్ల 51 లక్షల 78 వేలమంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా దేశంలో 3 లక్షల 22 వేల మంది మరణించారు.

దేశంలో ప్రస్తుతం కరోనా రోగుల రికవరీ రేటు 90.80 శాతంగా ఉంది. అటు యాక్టివ్ కేసుల సంఖ్య 8.04 శాతంగా ఉంది. మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్  ప్రక్రియలో వేగం అందుకుంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30 లక్షల 62 వేల 747 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.