అరుదైన గౌరవం దక్కిoచుకొన్న “సింహాచలం అప్పన్న” దేవస్థానo

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ ది పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌(ప్రసాద్‌) ప‌థ‌కానికి సింహాచ‌లం అప్పన్న దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించింది. దీనిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం చైర్మన్ సంచ‌యిత గ‌జ‌ప‌తి రాజు హర్షం వ్యక్తం చేశారు.

ప్రసాద్’ పథ‌కంలో దేశవ్యాప్తంగా ఉన్న 5 ఆలయాల్లో సింహాచలం దేవస్థానాన్ని ఒకటిగా ఎంపిక చేశారు. దీనిపై కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు సంచయిత కృతజ్ఞత‌లు తెలిపారు. సింహాచలం దేవస్థానాన్ని రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోని హిందువులకు పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆమె వెల్లడించారు.

మార్చిలో దేవస్థానానికి చైర్‌పర్సన్‌గా నియమించబడ్డాక వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులను కలిసి ఆలయ చారిత్రక విశిష్టత గురించి వివరించారని, కేంద్ర పథకం కింద ఆలయాన్ని చేర్చాలని కోరినట్లు తెలిపారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రసాద్ పథకంలో చేర్చారని తెలియజేసారు.