మహిళల క్రికెట్ లో చరిత్ర సృష్టించిన స్నేహ్ రాణా!

అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుతం చేసి చూపించింది స్నేహ్ రాణా. మహిళా క్రికెట్ లో చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించి తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కట్టిపడేసింది. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఆమె బౌలింగ్ లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో అర్ధశతకాన్ని నమోదు చేసింది.

తద్వారా మహిళా అంతర్జాతీయ క్రికెట్ లో టెస్ట్ అరంగేట్ర మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించిన మొదటి భారత ప్లేయర్ గా, మొత్తంగా నాలుగో ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. ఆరు లేదా అంతకన్నా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ వుమన్ గానూ ఆమె రికార్డును సొంతం చేసుకుంది.

కాగా, ఆమె 80 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. తాన్యా బాటియా (44 నాటౌట్)తో కలిసి 104 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసి.. భారత్ ను ఓటమి నుంచి బయటపడేసింది. శనివారం ఆట డ్రాగా ముగిసింది. ఫాలో ఆన్ ఆడిన భారత మహిళల జట్టు 8 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. స్నేహ్ తో పాటు తాన్యా ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించారు.