జనాభా నిష్పత్తిన న్యాయం చేస్తేనే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది

• బీసీలను వైసీపీ ఓట్లు వేసే యంత్రాలుగా మార్చేసింది
• హక్కులు అడుగుతామనే కుల గణన చేపట్టడం లేదు
• స్థానిక సంస్థల్లో 16 వేల పదవులు బీసీలకు దూరం చేశారు
• కార్పొరేషన్ల పేరిట పనికిమాలిన పదవులిచ్చి చేతులు దులుపుకున్నారు
• సబ్ ప్లాన్ నిధులు అడిగితే ఫించన్లు.. అమ్మ ఒడి లెక్కలు చూపుతున్నారు
• వైసీపీ మోసాన్ని ప్రశ్నించకుంటే బీసీల జీవితాలు మారవు
• అర్ధ రూపాయికి ఓటు అమ్ముకోవడం మానేలా అవగాహన కల్పించాలి
• జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
• ఆవిర్భావ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్న పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

జనాభా ప్రాతిపదికన హక్కులు అడుగుతామనే ఈ ప్రభుత్వాలు కులగణన అనే అంశాన్ని పక్కన పెట్టాయని, బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే ఈ ముఖ్యమంత్రి చూస్తున్నారని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో కోత పెట్టి 16 వేల పదవుల్ని బీసీలకు దూరం చేశారని, పనికిమాలిన కార్పోరేషన్లతో 600 పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రశ్నించకపోతే బీసీల జీవితాలు మారవన్నారు. బడుగు, బలహీన వర్గాల ఓట్లతో ప్రధానులు, ముఖ్యమంత్రులు అవుతున్నా బీసీల జీవితాల్లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం జరిగిన నాడే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని తెలిపారు. సబ్ ప్లాన్ నిధులు అడిగితే ఫించన్లు. అమ్మ ఒడి లెక్కలు చూపుతున్నారన్నారు. కులగణన గురించి అడిగితే ఈ నాయకులు అధికారంలోకి రాకముందు ఒకలా.. అధికారం వచ్చాక ఒక రకంగా మాట్లాడుతున్నారన్నారు. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకోవడం మానుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వస్తుందని తెలిపారు. గ్రామ స్థాయిలో అవగాహన కల్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకోవాలని కోరారు. శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొని సమస్యలపై ప్రసంగించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “బీసీల సాధికారతకు వినియోగించాల్సిన నిధుల్లో ఈ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేసింది. మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని అన్నారు.
• కులాల విభజనతో చిన్నాభిన్నం చేస్తున్నారు – శ్రీ కేసన శంకర రావు
బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ కేసన శంకర రావు మాట్లాడుతూ “పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం అభివృద్ధి జరిగితేనే సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుంది. జనాభా నిష్పత్తిన అభివృద్ధి చేసే ఉద్దేశం ఏ రాజకీయ పార్టీలో కనబడడం లేదు. కుల గణాంకాలు లేకపోవడం వల్ల అన్ని విధాలుగా నష్టపోతున్నాం. మండల్ కమిటీ సిఫార్సుల అమలు కోరితే అధికారంలోకి వచ్చే ముందు ఒక రకంగా వచ్చాక ఒక రకంగా మాట్లాడుతున్నారు. నివేదికలు పక్కన పెట్టి ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో పబ్బం గడుపుకుంటున్నారు. బలహీన వర్గాలకు రాజ్యంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాస్తున్నారు. కార్పోరేషన్ల పేరిట కులాలను చిన్నాభిన్నం చేస్తున్నారు” అన్నారు.
* వ్యక్తిగత కేసుల గురించి పది నిమిషాల్లో స్పందిస్తారు – శ్రీ క్రాంతి కుమార్
బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షులు శ్రీ కె. క్రాంతి కుమార్ మాట్లాడుతూ “స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వ నిర్వాకానికి 16 వేల నాయకత్వాన్ని బీసీలు కోల్పోయారు. కోర్టు అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వ్యక్తిగత కేసుల గురించి పది నిమిషాల్లో స్పందిస్తారు. బీసీలకు న్యాయం చేసే అంశం మీద మాత్రం వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. 93 బీసీ కులాలను 143 కులాలుగా మార్చారు. శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి హయాంలోనే బీసీ కులాలు చెల్లాచెదురయ్యాయి. ఇప్పుడు 56 కార్పోరేషన్లు పెట్టి మరోసారి చెల్లాచెదరు చేశారు. ఏ కమిషన్ సిఫార్సుల మేరకు విడగొట్టారో తెలియదు. బీసీలకు ఏ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బీసీలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వాల్లో చలనం రావడం లేదు. జీరో బడ్జెట్ రాజకీయాలతోనే ఇలాంటి పరిస్థితులు మారుతాయ”ని అన్నారు.
• ఓటును నమ్ముకుంటే సమస్యలు ఉండవు – శ్రీ ముత్యాల నాయుడు
మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ ముర్రు ముత్యాల నాయుడు మాట్లాడుతూ “అన్ని సమస్యలకు ఓటును అమ్ముకోవడమే కారణం. ఓటును నమ్ముకుంటే ఇన్ని సమస్యలు ఉండవు. డబ్బు తీసుకుని ఓటు వేయకుండా ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజున మార్పు సాధ్యపడుతుంది. అర్ధ రూపాయికి ఓటు అమ్ముకోవడం ఎంత తప్పో ప్రజలకు వివరించండి” అన్నారు.
* కాకి లెక్కలతో బడ్జెట్ లో కోత పెట్టారు – శ్రీ కోన తాతారావు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కోన తాతారావు మాట్లాడుతూ “వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు దక్కాల్సిన రాజ్యాంగపరమైన పదవుల్ని దూరం చేసేసింది. 43 శాతం మాత్రమే బీసీలు ఉన్నారని మభ్యపెడుతున్నారు. ఈ ప్రభుత్వానివి కాకి లెక్కలు. జనాభా ప్రాతిపదికన హక్కులు అడుగుతామనే కులగణన చేయడం లేదు. సబ్ ప్లాన్ నిధులు అడిగితే రంగు రాళ్ల పథకాల పేర్లు చెబుతున్నారు. పనికి రాని ముఖ్యమంత్రి కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే. శ్రీ జగన్ రెడ్డి అదే కోవకి వస్తారు” అన్నారు.
* ఇక్కడ బీసీలు.. అక్కడ ఓసీలయ్యాం- శ్రీ పితాని బాలకృష్ణ
పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ లో బీసీలుగా ఉన్న శెట్టి బలిజల్ని తెలంగాణలో ఓసీలుగా మార్చారు. దీనిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలి. రియల్ ఎస్టేట్ దాహానికి అంతరించిపోతున్న తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రత్యేకంగా భూములు కేటాయించాలి” అన్నారు.
* రైతుల ఆత్మహత్యల తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలే ఎక్కువ – శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్
పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల తర్వాత చేనేతల ఆత్మహత్యలే అధికం. గత ప్రభుత్వాలు గాని, ప్రస్తుత ప్రభుత్వం గాని చేనేతల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే బీసీల హక్కులు కాపాడుతారన్న నమ్మకంతో ఉన్నామ”న్నారు.
• బీసీల బ్రాండ్ అంబాసిడర్ శ్రీ పవన్ కళ్యాణ్ – శ్రీ పోతిన మహేష్
విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన మహేష్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం దెబ్బకి స్థానిక సంస్థల్లో బీసీలకు 16, 800 పదవులు దూరమయ్యాయి. బీసీ ద్రోహి శ్రీ జగన్ రెడ్డి. 56 పనికి మాలిన కార్పోరేషన్లు పెట్టారు. ఒక్క సామాజిక వర్గానికి కూడా రుణం ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ జీవితం అయినా మారిందా? నామినేటెడ్ పదవుల్లో 5 శాతం కూడా బీసీలకు కేటాయించలేదు. ఈ ముఖ్యమంత్రికి రెడ్లు తప్ప బీసీలు గుర్తుకు రారు. జగనన్న కాలనీల ముసుగులో బీసీల ఆధీనంలో ఉన్న 6 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నారు. బీసీలకు బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటే.. శ్రీ జగన్ రెడ్డి బీసీల ద్రోహిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతార”న్నారు.
* మత్స్యకారుల సంక్షేమం గాలికి వదిలేశారు – శ్రీ నాయకర్
పార్టీ మత్స్యకార వికాస విభాగం చైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి ఎలాంటి స్థానం ఇవ్వటం లేదు. మత్స్యకారుల కోసం ఆలోచన చేసిన పార్టీ జనసేన. ఈ వర్గ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచాం” అన్నారు.
* షేక్ లు, దూదేకుల్ని విడగొట్టి లెక్కలు చెబుతున్నారు- శ్రీ నాగుల్
షేక్ లు, దూదేకులు ఒక్కటే అయినా ఉద్దేశ పూర్వకంగా విడగొట్టి లెక్కల్లో చూపుతున్నారు. గత ప్రభుత్వంలో సమావేశం పెడితే నూర్ బాషాల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఇప్పుడున్న శ్రీ జగన్ రెడ్డి మాటలు నమ్మి ఓటు వేశాం. ఇచ్చిన హామీలు అన్నీ గాలికి వదిలేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారన్న నమ్మకంతో మాట్లాడుతున్నా సామాజిక న్యాయం అంటే ఇప్పటి వరకు చట్ట సభల్లో అడుగు పెట్టని వారికి అవకాశం ఇవాలని అన్నారు.
* 5 శాతం ఓటు ఉన్న మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు – శ్రీ అన్నవరపు నాగమల్లేశ్వరరావు
రజక సంఘం నాయకులు శ్రీ అన్నవరపు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. మాది సమాజానికి సేవ చేసే కులం. ఎవరు హుందాగా కనిపించినా దాని వెనుక రజకుడి కష్టం ఉంది. ఇటీవల మా కులం మీద దాడులు పెరిగాయి. కేసుల్లో మాకు అన్యాయం జరిగినా శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రాజకీయల్లో గెలుపు ఓటముల మీద మా జీవితాలు ఆధారపడేలా చేయడం ధర్మం కాదు. 5 శాతం ఉన్న మా పై చిన్న చూపు చూడడం అన్యాయం. 34 లక్షల మంది రజకులంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తాం. మాకు న్యాయం చేయండి అని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీమతి రాయపాటి అరుణ, శ్రీమతి పోలాసపల్లి సరోజ, పలు కుల సంఘాల నాయకులు ప్రసంగించారు.