సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే: గురాన అయ్యలు

విజయనగరం, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే అని
జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రి బాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ దేశంలో కులవివక్ష, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన తొలి వ్యక్తి ఫూలే అని కొనియాడారు. శతాబ్దాల నాడే అణగారిన వర్గాల కోసం, స్త్రీ విద్య కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లిన మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్ర‌జ‌ల హృద‌యాల్లో నేటికీ నిలిచి ఉన్నార‌ని కొనియాడారు. వారి ఆశ‌యాల‌ను సాధించ‌డ‌మే ఆయ‌న‌కు మనం ఇచ్చే నిజ‌మైన నివాళిగా పేర్కొన్నారు. సమన్యాయ సత్యశోధకులైన మహాత్మా ఫూలే చెప్పిన మాటలను వల్లె వేయడం కాకుండా వాటిని ఆచరించి చూపించడం జనసేన పార్టీ విధివిధానాల్లో భాగమని తెలియజేశారు. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం.. పూలే ఆలోచనలకు దగ్గరగా ఉండే సూత్రమన్నారు. ఆ మహనీయుని అడుగు జాడల్లో జనసేన ప్రస్థానం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయకర్త ఆదాడ మోహన్ రావు, విజయనగరం నియోజకవర్గం జనసైనికులు ఏంటి రాజేష్, ఎమ్.పవన్ కుమార్, గొల్లపల్లి మహేష్, పృథ్వీ భార్గవ్, అభిలాష్, మధు తదితరులు పాల్గొన్నారు.